28-03-2025 12:39:18 AM
సంగారెడ్డి, మార్చి 27 (విజయ క్రాంతి): ఏప్రిల్ 14న జరిగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని అన్ని గ్రామాల్లో అధికారికంగా నిర్వహించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాటం (కెవిపిఎస్) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు,పట్టణాల్లో, బస్తీలలో ప్రభుత్వమే అధికారికంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహించాలన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్ర దేశానికి సమాజానికి ఆయన చేసిన అశేషమైన సేవ త్యాగం దేశభక్తి గురించి రాజ్యాంగం పైన కుల వివక్షత అంటరానితనం మనుషులంతా సమానమే వంటి చైతన్య పరిచే కార్యక్రమాలను నిర్వహించాలి తెలిపారు.
ఈ నెల లో జిల్లాలోని ప్రతి మండలంలో పౌర హక్కుల దినం నిర్వహించాలని అన్ని ప్రభుత్వ శాఖల నుండి అధికారులందరూ పాల్గొనే విధంగా ఆదేశాన్ని ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం శివకుమార్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.