- మరో 241 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
- 23,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ
ముంబై, జనవరి 10: దేశీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళన, రూపాయి క్షీణత, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరల పెరుగుదల తదితర అంశాలతో వరుసగా మూడో రోజూ స్టాక్ మార్కెట్ తగ్గింది. రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 77,919-77,099 పాయింట్ల మధ్య 820 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడింది.. చివరకు మరో 241 పాయింట్ల నష్టంతో 77,378 పాయింట్ల వద్ద నిలిచింది.
నిఫ్టీ ఇంట్రాడేలో 23,595-23,370 పాయింట్ల హెచ్చుతగ్గులకు లోనై చివరకు 23,500 పాయింట్ల కీలకస్థాయి దిగువన 95 పాయింట్ల నష్టంతో 23,431 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,844 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూడగా, నిఫ్టీ 573 పాయింట్లు కోల్పోయింది.
క్రూడ్ ధరలు పెరగడం, డాలర్ ఇండెక్స్ పటిష్టంగా ట్రేడ్‌కావడం, ట్రంప్ అనుసరించే వాణిజ్య విధానాల పట్ల ఆందోళన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపర్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
భారత్ మార్కెట్ విలువలు ఈ స్థాయిలో కూడా ఖరీదుగా ఉండటంతో ఆందోళనచెందుతున్న ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్నారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 79 డాలర్లకు చేరగా, డాలరు మారకంలో రూపాయి విలువ 86 స్థాయికి పడిపోయింది.
ఐదు రోజుల్లో రూ.16,500 కోట్లకుపైగా ఎఫ్‌పీఐ విక్రయాలు
దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) విక్రయాలు ఈ వారం వరుసగా ఐదో రోజూ కొనసాగాయి. గురువారం ఒక్కరోజులోనే రూ.7,171 కోట్లు పెట్టుబడులు వెనక్కు తీసుకున్న ఎఫ్‌పీఐలు శుక్రవారం మరో రూ.2,254 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దీంతో ఈ వారం వరుస ఐదు రోజుల్లో వీరి నికర అమ్మకాలు రూ.16,500 కోట్లకు చేరాయి. డాలర్ పటిష్టంగా ఉంటూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.
ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 109పైకి చేరగా, 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 4.7 శాతానికి పెరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
టీసీఎస్ టాప్ గెయినర్
మార్కెట్ క్షీణించినప్పటికీ తాజాగా వెల్లడించిన క్యూ3 ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో సెన్సెక్స్-30 ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 5.5 శాతం ర్యాలీ జరిపింది. డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 11.95 శాతం వృద్ధితో రూ.12, 380 కోట్లకు చేరింది.
టీసీఎస్ బాటలోనే ఇతర ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాలు 3 శాతం వరకూ పెరిగాయి. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ 4.4 శాతం నష్టపోయింది. ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెం ట్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ , అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ 3.5 శాతం వరకూ తగ్గాయి.
వివిధ రంగాల సూచీల్లో అధికంగా పవర్ ఇండెక్స్ 3.07 శాతం క్షీణిం చింది. యుటిలిటీస్ ఇండెక్స్ 2.86 శా తం, రియల్టీ ఇండెక్స్ 2.64 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 2.08 శాతం, కమో డిటీస్ ఇండెక్స్ 2.05 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 1.98 శాతం చొప్పు న తగ్గాయి.