calender_icon.png 11 October, 2024 | 4:01 AM

మూడో రోజూ డౌన్

02-10-2024 12:00:00 AM

ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు 

ముంబై, అక్టోబర్ 1: విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో వరుసగా మూడో రోజూ  శుక్రవారం భారత స్టాక్ సూచీలు క్షీణతను చవిచూశాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 84,098 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకి, చివరకు 33 పాయింట్ల తగ్గుదలతో 84,266 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇదేబాటలో  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ఇంట్రాడేలో 25,739  పాయింట్ల వద్ద కనిష్ఠస్థాయిని నమోదుచేసి, 14 పాయింట్ల నష్టంతో 25,796  పాయింట్ల వద్ద నిలిచింది. వరుస మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,570 పాయింట్లు, నిఫ్టీ 419 పాయింట్లు పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లు నిస్తేజంగా ట్రేడ్‌కావడం, విదేశీ ఫండ్స్ భారీ విక్రయాలు జరపడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు తెలిపారు.

చైనా కేంద్ర బ్యాంక్ ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో ఖరీదైన భారత్ మార్కెట్ నుంచి కొంతమేర నిధుల్ని చౌకగా ట్రేడవుతున్న చైనా షేర్లలోకి విదేశీ ఇన్వెస్టర్లు మళ్లిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. 

వెలుగులో ఐటీ షేర్లు

మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా ఐటీ షేర్లు ర్యాలీ జరిపాయి సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 2.9 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్‌లు 2 శాతం వరకూ లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 2.2 శాతం మేర పెరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐలు లాభాల్లో ముగిసాయి. మరోవైపు ఇండస్‌ఇండ్ బ్యాంక్  2.68 శాతం క్షీణించింది. 

ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనీలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, టాటా మోటార్స్, ఎన్టీపీసీలు 1.5 శాతం వరకూ తగ్గాయి.  వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఐటీ ఇండెక్స్ 1.05 శాతం పెరిగింది. టెక్నాలజీ ఇండెక్స్ 0.72 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.71 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.41 శాతం చొప్పున పెరిగాయి.

టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 0.86 శాతం క్షీణించగా, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.71 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.35 శాతం, బ్యాంకెక్స్ 0.89 శాతం క్షీణించింది. యుటిలిటీస్ ఇండెక్స్ 0.82 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.24 శాతం, పవర్ ఇండెక్స్ 0.17 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.56 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం చొప్పున పెరిగాయి. 

నేడు మార్కెట్లకు సెలవు

మహాత్మా గాంధి జయంతి సందర్భంగా అక్టోబర్ 2 బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు సెలవు.