16-11-2024 12:00:00 AM
రెండు నెలల్లో ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశంలో వంటనూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒకేసారి 24 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో వీటి ధరలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి టారీఫ్‌ను కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. రెండు నెలల్లో లీటర్‌కు రూ.40 వరకు ధర పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో విదేశాల నుంచి ముడిచమురు దిగుమతులు తగ్గడమూ ఒక కారణమని చెప్తున్నారు.
ఇది ఇలానే కొనసాగితే మరి కొద్దిరోజుల్లో లీటర్ వంటనూనె రూ. 200 మార్కు దాట వచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత నిత్యావసర ధరలు నియంత్రణలో లేకుండాపోయాయి. పప్పులు, నూనె, బియ్యం ఒక్కటేమిటి, ప్రతి వస్తువు ధర పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. గత మార్చిలో లీటర్ పామాయిల్ రూ.90, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.105 ఉండేది. ప్రస్తుతం పామాయిల్ ధర రూ.137కు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.145కు చేరుకుంది.
కేంద్ర ప్రభుత్వం మలేషియా నూనె ధరల ప్రకారం ధరల మార్కెట్ టారీఫ్ ప్రకటిస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఇది తగ్గినట్లు చెప్తున్నారు. ముత్తుకూరు మండలం పంటపాలెం వద్ద 8 పామాయిల్ పరిశ్రమలు ఉన్నాయి. విదేశాలనుంచి ఓడలద్వారా వస్తున్న ముడిసరుకు ఇక్కడ్నించి పైప్‌లైన్ల ద్వారా ఫ్యాక్టరీలకు, అక్కడ్నించి ప్యాకెట్లు, డబ్బాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 100 లారీలు ఇక్కడ్నించి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటాయి.
యుద్ధం నేపథ్యంలో ఓడల్లో నూనె ముడిసరుకులు తక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు. మలేషియా నుంచి ఒక్కో ఓడలో సుమారు రూ.700 నుంచి రూ.800 కోట్ల విలువైన ముడిసరుకు దిగుమతి అవుతుంటుంది. దీనికి బీమా చేయిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే, ఆయిల్ కంపెనీలు బీమా క్లైయిమ్ చేసుకుంటాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బీమా కంపెనీలు ఆయిల్ ఓడల బీమాకు అంగీకరించడం లేదని సమాచారం.
ముడిసరుకు రవాణా రిస్క్‌ను ఆయిల్ కంపెనీలే భరించాల్సి వస్తుండడంతో దిగుమతులు కూడా తగ్గినట్లు చెప్తున్నారు. దీనివల్లకూడా నూనె ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. వంటనూనెల ధరలు పెరగడంతో భోజనం, క్యాటరింగ్ ధరలు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడు ఇంత భారీగా పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వంటనూనె ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
- సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట