calender_icon.png 25 September, 2024 | 5:53 PM

రేపిస్ట్ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు

25-09-2024 04:15:20 AM

టపాసులంటేనే భయపడే వ్యక్తి తుపాకీ ఎలా కాల్చాడు?

రంగంలోకి దిగిన సీఐడీ

పుణె, సెప్టెంబర్ 24: మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఓ యువకుడిని ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో సీఐడీ రంగంలోకి దిగి.. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన అక్షయ్‌షిండేను పోలీసులు సోమ వారం ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

“విచారణ కోసం జైలు నుంచి బద్లాపూర్ తరలిస్తుండగా.. ఓ పోలీసు దగ్గరి నుంచి తుపాకీ గుంజుకుని నిందితుడు కాల్పులు జరపగా తిరిగి మేం కాల్పులు జరిపాం” అని పోలీసులు తెలిపారు. కానీ ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఐడీ విచారణ మొదలెట్టింది. ఘటనా సమయంలో ఉన్న పోలీసుల వాంగ్మూలాలను, నిందితుడి తల్లిదండ్రుల వాంగ్మూలాలను కూడా సీఐడీ అధికారులు నమోదు చేశారు.

నిందితుడు తల్లిదండ్రులు తమ కుమారుడి హత్యపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. మృతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడికి టపాసులంటేనే భయమని, అలాంటివాడు తుపాకీ ఎలా పేలుస్తాడని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.