- ప్రాజెక్టు సామర్థ్యం బలోపేతానికి చర్యలు శూన్యం
- గతేడాది మరమ్మతులకు రూ.1.20 కోట్లు
- వినియోగంపై సమాధానం చెప్పని అధికారులు
భధ్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 4(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారా వుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలో నిర్మించిన పెదవాగు మధ్యతరహా ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలను 15 సంవత్సరాల క్రితమే నీటిపారుదలశాఖ అధికారులు గుర్తించినా.. ప్రాజెక్టు సామర్థ్యం బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అను మానాలకు తావిస్తున్నది.
దీనికి తోడు రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు తెలంగాణలో ఉండటం, పంట పొలాలన్నీ ఏపీలో ఉండటంతో అంతరాష్ట్ర వివాదం తలెత్తింది. మరో వైపు ప్రాజెక్టులో భారీగా ఆక్రమణలు చోటుచేసుకొని పూడికతో నిండిపోయింది. దీంతో ప్రాజెక్టుకు గండి పడి రూ.కోట్లాది విలువగ ల ఆస్తి, పంటల నష్టం జరిగిన విషయం విధితమే. అందుకు కారకులెవ్వరనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం శోచనీయం.
15 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ప్రాజెక్టు
2007 సంవత్సరలో పెదవాగు ప్రాజెక్టును మరింత పటిష్టం చేయాల్సి ఉన్నదని అప్పటి అధికారులు రూ.100 కోట్ల కోసం ప్రపంచ బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించారు. అధికారుల ప్రతిపాదనలు బుట్టదాఖలవడంతో ప్రాజెక్టు పటిష్టత దిగజారిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజనలో కుక్కునూరు, వేలేరుపాడు, మండలాలు ఏపీలో కలిశాయి. ప్రాజెక్టు తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో ఉంది. ప్రాజెక్టు ఆయకట్లు మొత్తం 14 వేల ఎకరాలు కాగా, తెలంగాణలో కేవలం 2వేల ఎకరాలు మాత్రమే మిగిలింది. మిగిలిన 12వేల ఎకరాలు ఏపీలో కలిశాయి. దీంతో అంతరాష్ట్ర వివాదం తలెత్తి ప్రాజెక్టు పర్యవేక్షణను గాలికి వదిలేశారు.
2021లో జీఆర్‌ఎంబీ పరిధిలో ప్రాజెక్టు
రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని అనేక ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల సంఘం పరిధిలోని గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ)ను ఏర్పాటు చేసి దాని పరిధిలోకి తీసుకున్నారు. 2021లో పెదవాగు ప్రాజెక్టు కూడా జీఆర్‌ఎంబీ పరిధిలో చేరింది.
దీని ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఆయకట్టు ఆధారంగా రాష్ట్రాల నుంచి నిధులు రాబట్టి మరమ్మతులు చేయాల్సి ఉంది. పెదవాగు ప్రాజెక్టు మరమ్మతులకు తెలంగాణ 15శాతం, ఏపీ 85శాతం నిధులు కేటాయించాల్సిందిగా బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వాలు నిధులు కేటాయించక పోవడంతో మరమ్మతులు చేయలేదు. ఫలితంగా ప్రాజెక్టు గేట్లు, తూములు, కట్ట, కాలువలు శిథిలమై బలహీనంగా మారాయి.
రూ.1.20కోట్లు ఏమయ్యాయి?
పెదవాగు ప్రాజెక్టు మరమ్మతుకు గతేడా ది ఏప్రిల్ నెలలో రూ.1.20కోట్లు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నారు. పనులు చేపట్టడానికి జీఆర్‌ఎంబీ అనుమతులు ఉన్నాయా లేదో చెప్పలేదు. ఆ అంశం ఇప్పటికి వివాదంగానే ఉంది. రూ.1.20కోట్లతో మరమ్మతులు చేస్తే ఏడాది వ్యవధి లోనే గేట్లు, మోటార్లు ఎందుకు పనిచేయ డం లేదని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెదవాగు ప్రాజెక్టు గండి విషయంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని, ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ప్రాజెక్టులో 60శాతం ఆక్రమణలు
ప్రాజెక్టు లోతట్టు ప్రాంతం 20 శాతం ఆక్రమణలకు గురైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు లోతట్టు ప్రాంతం మొత్తం 1,100 ఎకరాలు కాగా, సుమారు 60 శాతానికి పైగా ఆక్రమణలకు గురైంది. ఏటా పెద్ద సంఖ్యలో రైతులు లోతట్టులోని భూములను ఆక్రమించుకొని పంటలు సాగు చేస్తున్నారు.
దీనివల్ల ప్రాజెక్టు లోతట్టు పూడికతో నిండిపోయి నీటి నిల్వ సామర్థ్యం గణనీయయంగా తగ్గింది. ప్రాజెక్టు ప్రమా దంలోకి నెట్టబడుతుందని ఆయకట్టు రైతులు అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకొన్నా వినడం లేదు. ప్రాజెక్టు గండికి ఇదో కారణమని తెలుస్తోంది.