calender_icon.png 26 December, 2024 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్.. ట్రబుల్

04-11-2024 01:52:48 AM

  1. -పునాదుల్లోనే నిలిచిన ఇండ్ల నిర్మాణాలు
  2. -నాణ్యత లేక కుంగుతున్న పునాదులు
  3. అసంపూర్తి నిర్మాణాల్లో అసాంఘిక కార్యకలాపాలు
  4. నాలుగు మండలాల్లో ఊసేలేని డబుల్ ఇండ్లు

-సిరిసిల్ల, నవంబర్ 3 (విజయక్రాంతి): గూడు లేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు కట్టిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం సాధ్యపడలేదు. కోట్ల వ్యయంతో ఆర్భాటంగా ప్రారంభించిన డబుల్ బెడ్‌రూమ్‌లు కొన్ని చోట్ల పునాది దశల్లో, అసంపూర్తిగా దర్శనిమిస్తున్నాయి.

మరికొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తునా పంపిణీకి నోచుకోవడం లేదు. జిల్లాలోని నాలుగు మండలాల్లో మాత్రం కాగితాల్లోనే డబుల్ బెడ్ రూమ్‌లుండగా, ఒక్కటి ఇంటిని కూడా నిర్మించలేదు. గత ప్రభుత్వ పాలనలో డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం ఇంకా ట్రబుల్స్ ఎదుర్కొంటూనే ఉంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ, సిరిసిల్ల నియోజవర్గాలుండగా, ఇల్లంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గ పరిధిలోకి, బోయినపల్లి మండలం చొప్పదండి నియోజకవర్గ పరిధిలో వస్తుంది. మిగతా మండలాలు రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 6,886 డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరు కాగా, అందులో 4,279 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.

వీటిలో 3,653 ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా నిర్మాణం పనులు ప్రారంభం కావాల్సినవి 2,607 ఇళ్లు ఉన్నాయి. అధికారులు 3,357 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి  ప్రభుత్వం రూ.372 కోట్లు మంజూరు చేసింది. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,429 ఇళ్లు మంజూరయ్యాయి.

ఇందులో 3,871 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, నిర్మాణ ప్రగతిలో 482 ఇళ్లు ఉన్నాయి. 3,389 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంకా 558 ఇళ్లకు సంబంధించి పనులను ప్రారంభించకుండానే వదిలిపెట్టారు. నిర్మాణం పూర్తి చేసుకున్న 3,197 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. 

ఈ మండలాల్లో నిల్..

వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలానికి 92 డబుల్ బెడ్ రూంలు మంజూరు కాగా, అందులో కనగరి, కోనరావుపేట, నిమ్మపల్లి, రామన్నపేట, జవహార్ తండా, మల్కపేట గ్రామాలకు 15 ఇళ్ల చొప్పున మంజూరయ్యాయి. ఇందులో ఏ ఒక్క గ్రామంలోనూ పనులు ప్రారంభించలేదు.

చందుర్తి మండలానికి 45 ఇళ్లు మంజూరు కాగా, అందులో మూడుపల్లికి 15, సనుగులకు 20, జోగ్‌పూర్‌కు 10 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రుద్రంగి మండల కేంద్రానికి 35 ఇళ్లు మంజూరు కాగా, ఒక్కటి కూడా నిర్మాణం పూర్తి చేసుకోలేదు.

బోయినపల్లి మండలానికి  65 ఇళ్లు మంజూరు కాగా, అందులో బూర్గుపల్లికి 13, బోయినపల్లికి 22, దేశాయిపల్లికి 5, అనంతపల్లికి 5, నర్సింగాపూర్‌కు 20 ఇళ్లు మంజూరు కేటాయించారు. వీటిలోనూ ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా ప్రారంభించకపోవడం గమనార్హం. ఈ  నాలుగు మండలాల్లో డబుల్‌బెడ్ రూమ్‌ల నిర్మాణాలు కాగితాలకే పరిమితమయ్యాయి. తమకు మంజూరు చేసిన ఇండ్లను ఎప్పుడు నిర్మిస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

వేములవాడలో..

వేములవాడ నియోజకవర్గానికి మొత్తం 2,052 ఇళ్లు మంజూరు కాగా, కేవలం 224 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 144 ఇళ్ల పనులు కొనసాగుతుండగా, 80 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 1,828 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో వేములవాడ రూరల్ మండలానికి 1,080 మంజూరు కాగా, 80 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.

ఇంకా వెయ్యి ఇళ్లు మాత్రం పనులే ప్రారంభించలేదు. నిర్మాణం పూర్తయిన 80 ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. వేములవాడ అర్బన్ మండలానికి 800 ఇళ్లు మంజూరు కాగా, అందులో 144 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఇంకా 656 ఇళ్లు ప్రారంభించాల్సి ఉంది. 

వారి భూముల్లోనే నిర్మించి..

సిరిసిల్లలోని శాంతినగర్‌కు చెంది న దళిత కుటుంబాలకు 50 ఏళ్ల కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ భూమిని కొని అందులో అర్హులైన దళితులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించింది. అవి ప్రస్తుతం నివాసయోగ్యం గా లేకపోవడంతో వారు అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు.

ఆ స్థలాన్ని ప్రభుత్వానికి తిరిగిస్తే నర్సింగ్ కళాశాల నిర్మాణంతో పాటు డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మాణం చేపట్టి, భూము లు ఇచ్చిన వారికి కేటాయిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో వారు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ స్థలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ, వాటిని దళితులకు కేటాయించకుండా, ఇతరులకు అప్పజెప్పేందుకు అధికారులు చూస్తున్నారని పక్షం రోజుల క్రితం దళితులు ఆందోళనకు దిగారు.

తమ భూము లు లాక్కొని, ఇప్పుడు తమ స్థలంలో కట్టిన ఇళ్లను ఇతరులకు అప్పగిస్తామంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటికైనా నిర్మాణం పూ ర్తి చేసుకున్న ఇళ్లను అర్హులకు అందజేసి, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి గూడులేని వారికి కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.