calender_icon.png 1 November, 2024 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్..ట్రబుల్

30-07-2024 02:24:07 AM

  1. హుస్నాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కరువు
  2. పనులు పూర్తికాకముందే పట్టాల పంపిణీ
  3. అసౌకర్యాల నడుమ నివాసం
  4. ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు

హుస్నాబాద్, జూలై 29: ఇల్లులేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేసింది. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అయితే, పలుచోట్ల డబుల్ బెడ్‌రూమ్ సముదాయాల్లో సరైన సౌకర్యాలు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్నాబాద్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుట్టల వద్ద 12 బ్లాకుల్లో 288 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 96 ఇళ్లకు విద్యుత్తు, నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. డోర్లు, కిటికీలు బిగించలేదు.

అదేవిధంగా ఇళ్లకు ప్లాస్టింగ్ సైతం పూర్తి కాలేదు. మరో 24 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. అర్హుల ఎంపికను డ్రా పద్ధతిలో పూర్తి చేశారు. 264 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అయితే, ఎలాంటి సౌకర్యాలు లేకుండా నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల చుట్టూ దట్టమైన ముళ్లపొదలు, అడవిని తలపించే విధంగా చెట్లు ఉండడం, మౌలిక వసతులు లేకపోవడంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో రాత్రిపూట పాములు ఇళ్లలోకి వస్తున్నాయని వాపోతున్నారు. తాగునీరు, విద్యుత్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులను ఎక్కడికక్కడే వదిలేశారు.

దృష్టి పెట్టని అధికారులు..

లబ్ధిదారులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు వచ్చి 8 నెలలు కావొస్తున్నా నేటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అటువైపు చూడడం లేదు. పనులు పూర్తికాకముందే పట్టాలు ఇచ్చి గృహ ప్రవేశాలు చేయించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. నేటికీ విద్యుత్తు సౌకర్యం లేదు. చిన్నాచితకా పనులు, నిత్యావసరాలు, కూరగాయలు, విద్యా, వైద్యం వంటి వాటి కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. ఇళ్ల చుట్టూ కంపచెట్లు, చెత్తాచెదారం ఉండడంతో రాత్రి అయిందంటే విష సర్పాలు వచ్చే అవకాశం ఉండడంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తు న్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపి సౌకర్యాలు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.  

విద్యుత్తు సౌకర్యం కల్పించాలి.. 

నాకు ఇల్లు లేకపోవడంతో డబుల్ బెడ్‌రూమ్ కోసం దరఖాస్తు చేసుకోగా వచ్చింది. 8 నెలలుగా డబుల్ బెడ్‌రూమ్ ఇంటిలోనే ఉంటున్నాం. కానీ ఇంటికి పాస్టింగ్ పూర్తికాలేదు, డోర్లు, కిటికీలు బిగించలేదు, విద్యుత్తు, మంచినీరు సౌకర్యం కల్పించలేదు. 

కడమంచి సారమ్మ, లబ్ధిదారు

ఎవరూ పట్టించుకోవడం లేదు.. 

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయంలో విద్యుత్తు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. స్ట్రీట్ లైట్లు లేక రాత్రిపూట పాముల బెడద ఎక్కువవుతోంది.

కడమంచి సారమ్మ, లబ్ధిదారు