calender_icon.png 23 October, 2024 | 5:58 AM

స్టాండర్డ్ డిడెక్షన్ రెట్టింపు!

15-07-2024 12:10:00 AM

కొత్త పన్ను విధానంలో రూ.5 లక్షలకు మినహాయింపు పరిమితి

బడ్జెట్‌పై కేపీఎంజీ అంచనాలు

న్యూఢిల్లీ, జూలై 14: ఈ నెల 23న పార్లమెంటుకు సమర్పించనున్న బడ్జెట్లో స్టాండర్డ్ డిడెక్షన్‌ను రెట్టింపుచేసి రూ. 1 లక్షకు పెంచుతారని, గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు పరిమితిని అధికం చేస్తారని, మూలధన లాభాలపై పన్నుల వ్యవస్థను హేతుబద్దీకరిస్తారని అంచనా వేస్తున్నట్టు కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ అంచనా వేసింది.

వైద్య ఖర్చులు, ఇంధన ఖర్చులు, మొత్తంగా ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున జీవన వ్యయాలు పెరిగాయని, ఈ కారణంగా స్టాండర్డ్ డిడెక్షన్ పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతారని కేపీఎంజీ తాజాగా విడుదల చేసిన ఒక నోట్‌లో పేర్కొంది. వినియోగ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు లేదా పొదుపునకు మళ్లించేందుకు తగినరీతిలో ప్రజల చేతిలో మిగులు ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో కొత్త పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు చేరుస్తారన్న అంచనాను కేపీఎంజీ వెల్లడించింది. 

గృహరుణాల వడ్డీపై మినహాయింపు రూ. 3 లక్షలకు పెంపు

కొద్ది నెలలుగా  వడ్డీ రేట్లు పెరగడం, ఇతర నియంత్రణాపరమైన సంస్కరణలతో రియల్ ఎస్టేట్ రంగం నుంచి ఒత్తిడి పెరుగుతున్నందున, వచ్చే బడ్జెట్లో గృహ రుణాలపై ఊరట కల్పిస్తారని కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేస్తున్నది. గృహ రుణాలపై వడ్డీ చెల్లింపులకు పాత పన్ను విధానంలో ప్రస్తుతం రూ.2 లక్షల వరకూ ఇస్తున్న తగ్గింపు పరిమితిని (మొత్తం పన్ను ఆదాయం నుంచి తగ్గించుకునేందుకు) కనీసం రూ.3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నామని కేపీఎంజీ పేర్కొన్నది. సొంత నివాస గృహ రుణాలపై వడ్డీ చెల్లింపులకు కొత్త పన్ను విధానంలో కూడా డిడెక్షన్‌ను అనుమతించవచ్చని అంచనా వేసింది.

ఏ పన్ను విధానానికైనా మూలధన లాభాలపై ప్రస్తుతం  వివిధ రకాల ఆస్తులకు వివిధ పన్ను రేట్లు ఉన్నాయని, ఈ వ్యవస్థను హేతుబద్దం చేసే అవకాశం ఉన్నదని తెలిపింది. ప్రస్తుతం దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణించేందుకు ఆయా ఆస్తులను అట్టిపెట్టుకునే కాలపరిమితి పలు రకాలుగా... లిస్టెడ్ ఈక్విటీ షేర్లకు 12 నెలలు, రియల్ ఎస్టేట్‌కు 24 నెలలు, బాండ్లకు 36 నెలలు ఉన్నది. పన్నుల వ్యవస్థ సరళీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది విరుద్ధం. అందుచేత ఈ బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించి ఒకే తరహా కాలపరిమితిని, పన్ను రేటును ప్రకటించే అవకాశం ఉన్నదని కేపీఎంజీ వివరించింది. 

పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి

ట్యాక్స్ ప్రాక్టీషనర్ల వినతి

కోల్‌కతా, జూలై 14: వచ్చే కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలపై  పన్ను భారాన్ని తగ్గించాలని ట్యాక్స్ ప్రాక్టీసనర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పన్ను మినహాయింపు  పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (ఏఐఎఫ్‌టీపీ) ప్రెసిడెంట్ నారాయణ్ జైన్ కేంద్రాన్ని కోరారు. అలాగే పన్నుల విధానాన్ని సరళీకరించాలని, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం, రూ.10 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ.20 లక్షలు పైబడిన ఆదాయంపై 25 శాతం పన్నును నిర్ణయించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించిన మెమోరాండంలో జైన్ విన్నవించారు.

సెస్, సర్‌ఛార్జ్‌లను ఎత్తివేయాలని, అవి ఇంకా కొన సాగించడం సహేతుకం కాదని సూచించారు. ఎడ్యుకేషన్ సెస్‌ను ఎలా విని యోగిస్తున్నదో ప్రభుత్వం వివరించడం లేదని, విద్య, వైద్య సదు పాయాల కల్పన ప్రభుత్వ ప్రాధమిక బాధ్యత అని ఫెడరేషన్ ప్రెసిడెంట్ చెప్పారు. సెక్షన్ 115బీబీఈ కింద ఆధారాలు లేని నగదు జమ, రుణాలు, పె ట్టుబడులు, వ్యయాలపై పన్ను రేటును డీమానిటైజేషన్ సమయంలో సెస్‌తో కలిపి 75 శాతానికి పెంచారని, ఆ రేటు ను తిరిగి 30 శాతానికి పునరుద్ధరించాలని జైన్ తన వినతి పత్రంలో కోరారు.