ఐపీఎల్‌లో నేడు డబుల్ హెడర్
చెన్నైతో రాజస్థాన్ అమీతుమీ
బెంగళూరుతో ఢిల్లీ ఢీ
ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో పది లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ చేరే జట్లపై స్పష్టత మాత్రం రాలేదు. ఆరంభంలో ఆశలు రేపి అందరికంటే ముందు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుందనుకున్న రాజస్థాన్ గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవగా.. గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తమ దారులు సంక్లిష్టం చేసుకుంది. ముందడుగు వేయాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో ఈ రెండు జట్లు అమీతుమీకి సిద్ధం కాగా.. మరో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. బెంగళూరుతో పోలిస్తే.. ఢిల్లీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నా.. కెప్టెన్ పంత్ అందుబాటులో లేని ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం!
ఎవరి అవకాశాలెంత!
ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశలోని 70 మ్యాచ్‌ల్లో 60 పూర్తునా.. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ చేరే జట్ల విషయంలో స్పష్టత రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి మెరుగ్గా ఉన్నా.. మిగిలిన రెండు జట్లు ఏవి అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఎనిమిది జట్ల అవకాశాలను
ఓసారి పరిశీలిస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు ఖతాలో వేసుకున్న కోల్‌కతా.. ఇక అగ్రస్థానంపై స్థిరంగా ఉండటంపై దృష్టి సారించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్
పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండు సొంతగడ్డపైనే జరగనుండటం రైజర్స్‌కు కలిసొచ్చే అంశం కాగా.. వీటిలో రెండింట నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
రాజస్థాన్ రాయల్స్
ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట నెగ్గిన రాజస్థాన్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగు పెట్టనుంది. ఒక వేళ మూడింట్లోనూ ఓడినా.. ఇతర జట్ల జయాపజయాలపై
ఆధారపడి ముందడుగు వేయొచ్చు.
బెంగళూరు x ఢిల్లీ
బెంగళూరు: సీజన్ ఆరంభంలో ఎదురుదెబ్బలు తిని.. దాదాపు ప్లే ఆఫ్స్ అవకాశాలు దూరమైన సమయంలో రాయల్ చాలెజంర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అదరగొడుతోంది. నాకౌట్‌కు చేరడం కష్టం అనుకున్న తరుణంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గిన ఆర్సీబీ.. సంచలనాలపై ఆశలు పెట్టుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు నెగ్గినా బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టమే అయినా.. తమ చేతిలో ఉన్న దాన్ని మాత్రం చేసి చూపెట్టాలని రాయల్ చాలెంజర్స్ బృందం భావిస్తోంది. మరోవైపు ప్లే ఆఫ్స్ చేరడం ఖాయమే అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రిషబ్ పంత్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడటంతో అతడి స్థానంలో అక్షర్ పటేల్ ఢిల్లీకి సారథ్యం వహించనున్నాడు. దీంతో ఢిల్లీ కన్నా బెంగళూరు కాస్త బలంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ ఆర్సీబీకి అన్నీ తానై నడిపిస్తుండగా.. ఢిల్లీ తరఫున యువ ఓపెనర్ జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ అదరగొడుతున్నాడు.
వార్నర్‌ను మించి విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అతడు ప్రత్యర్థులను కంగారెత్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు పైచేయి సాధించాలంటే మెక్‌గుర్క్ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరముంది. ఇక చిన్న బౌండ్రీల చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద ఖాయమే కాగా.. ఇరు జట్ల మద్య జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట నెగ్గడం బెంగళూరుకు సానుకూలాంశం. మెక్‌గుర్క్‌తో పాటు అభిషేక్ పొరెల్, హోప్, స్టబ్స్, అక్షర్ పటేల్‌తో ఢిల్లీ బ్యాటింగ్ బలంగానే ఉంది. ఖలీల్, ముఖేశ్, కుల్దీప్, రసిక్ సలామ్ బౌలింగ్ భారం మోయనున్నారు. మరోవైపు గత మ్యాచ్లో తృటిలో సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్న కోహ్లీ ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉండగా.. డుప్లెసిస్, విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. రజత్ పాటిదార్, దినేశ్ కార్తీక్ తమ పాత్రలు సమర్థవంతంగా పోషిస్తున్నారు. బౌలింగ్‌లో సిరాజ్, యష్, కర్ణ్ శర్మ కీలకం కానున్నారు.
చెన్నై x రాజస్థాన్
చెన్నై: సొంతగడ్డపై మరో కీలక పోరుకు చెన్నై సిద్ధమైంది. గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సూపర్ కింగ్స్.. ఆదివారం తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి 12 పాయింట్లతో ఉన్న చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు తప్పనిసరి. చివరి మ్యాచ్ బెంగళూరుతో ఆడాల్సి ఉండగా.. నేడు రాయల్స్‌తో అమీతుమీకి రెడీ అయింది. ఈ రెండింట్లో నెగ్గితే చెన్నై సాఫీగా నాకౌట్‌కు అర్హత సాధించనుంది. మరోవైపు సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో విజృంభించి ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలవడం ఖాయమే అనిపించిన రాజస్థాన్.. గత రెండు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక వెనుకబడి పోయింది. 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో ఉన్న రాయల్స్.. చెన్నైకి చెక్ పెడితే అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
బలాబలాల పరంగా చూసుకుంటే.. ఇరు జట్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోయినా.. రాజస్థాన్ బౌలింగ్ సూపర్ కింగ్స్ కన్నా మెరుగ్గా కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్‌లోనూ చెన్నైకి సమస్యలు ఉన్నాయి. టాపార్డర్‌లో రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, డారిల్ మిషెల్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ పై భారం పడుతోంది. ముస్తఫిజుర్, పతిరణ గైర్హాజరీలో బౌలింగ్ విభాగం బలహీనంగా ఉన్నా.. తుషార్ దేశ్ పాండే, శార్దూల్ ఠాకూర్ సత్తాచాటుతున్నారు. మరోవైపు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరగా, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్‌తో రాయల్స్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌల్ట్, అవేశ్ ఖాన్, యుజ్వే్రం చాహల్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు.
గుజరాత్ జెయింట్స్
చెన్నైపై చక్కటి విజయంతో జోష్‌లో ఉన్న గుజరాత్ జెయింట్స్.. ఇంకా ప్లే ఆఫ్స్ మీద ఆశలు పెట్టుకున్నట్లే ఉంది. తాము అద్భుతాన్ని నమ్ముతామని.. టైటాన్స్ అలాంటి ప్రదర్శనతో ముందడుగు వేయగలదని ఆ జట్టు కెప్టెన్ గిల్ ధీమాతో ఉన్నాడు. అయితే వాస్త వ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. బెంగళూరు, గుజరాత్ అధికారికంగా రేసులో ఉన్నా.. అవి ముందడుగు వేయడం కల్లే!
బెంగళూరు
సీజన్ ఆరంభంలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే గెలిచిన బెంగళూరు.. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలతో తామూ రేసులో ఉన్నామని చాటింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు నెగ్గినా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే.
చెన్నై సూపర్ కింగ్స్
గుజరాత్ చేతిలో పరాజయంతో ఒక్కసారిగా సందిగ్ధంలో పడ్డ చెన్నై సూపర్ కింగ్స్.. నేడు రాజస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. దీంతో పాటు చివరి లీగ్ మ్యాచ్ లోనూ గెలిస్తేనే చెన్నై సజావుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒక్క దాంట్లో ఓడినా ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్
ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రోజు బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో పాటు.. చివరిదాంట్లోనూ గెలిస్తేనే క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉండనుంది. చెన్నై, ఢిల్లీ, లక్నోలు 12 పాయింట్లతోనే ఉన్నా.. రన్‌రేట్‌లో మాత్రం చెన్నై మిగిలిన రెండు జట్ల కంటే మెరుగ్గా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్
హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయం తర్వాత కెప్టెన్సీ మార్పు చర్చతో వార్తల్లోకి ఎక్కిన లక్నో సూపర్ జెయింట్స్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించినా ముందడుగు వేయడం కష్టమే.