calender_icon.png 25 December, 2024 | 11:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ గుబుల్!

19-10-2024 12:57:12 AM

  1. ఇప్పటికే 12 మార్లు విచారణ చేసిన అధికారులు 
  2. యేండ్లు గడుస్తున్నా కొనసాగుతున్న విచారణ 
  3. అందుబాటులో ఉన్న ఇండ్లను ఇచ్చేందుకు ప్రణాళికలు 
  4. గత సర్కారు జిల్లాకు కేటాయించిన ఇండ్లు 8719

మహబూబ్‌నగర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): సొంతింటి కల నిజమైనప్పుడు ఆ సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు అందించాలనే సంకల్పంతో గత సర్కారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఎంత ఫోకస్ పెట్టినప్పటికీ ఆశించిన మేరకు ఇండ్లను నిర్మించలేదనే ఆరోపణలు ప్రజల్లో  ఉన్నాయి.

2015 జనవరి 15లో  మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాతతోట, ఎర్రమనుగుట్ట వీరన్నపేట, పాతపాలమూరు ప్రాంతాలను సీఎం కేసీఆర్ సందర్శించారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మహబూబ్‌నగర్‌కు ప్రత్యేకంగా 2,300 ఇండ్లను మంజూరు  చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,701 ఇండ్లు నిర్మించి అందించేదుకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఇండ్లను నిర్మించినప్పటికీ అర్హులకు అందలేదని ప్రస్తుత ప్రభుత్వం వాదిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నది. ఈ విచారణతో తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్  ఇళ్లు ఉంటాయో, ఉండవోనన్న సందేహం నెలకొందని లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు. 

 జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు ఇలా...

జిల్లా వ్యాప్తంగా 8,719 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాలని గత సర్కారు మంజూరు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ కాలేదు. ఇప్పటివరకు జిల్లాలో 6,950 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. దాదాపుగా మరో 1,500 నిర్మాణదశలో ఉన్నాయి.  గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 1,769 ఇళ్లకు గ్రౌండింగ్ కాలేదు.  జిల్లా వ్యాప్తంగా 1,769 ఇళ్లకు శంకుస్థాపన జరుగలేదు. దీంతో వీటి నిర్మాణం జరిగే అవకాశాలు లేవని సంబంధింత అధికారులు పేర్కొంటున్నారు. 

విచారణ వేగవంతం..

డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయాన్ని మరింత పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో విచారణ వేగవంతం చేసి ఎన్నికల తరువాతనే ఈ ప్రక్రియను ముందు ఉంచుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దివిటిపల్లితోపాటు పలు ప్రాంతాల్లో అధికారులు 12 సార్లు విచారణ చేశారు.

ఇండ్లు ఇచ్చి కూడ దాదాపు 5 సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విచారణ యథావిధిగా కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ మున్సిపాల్టి పరిధిని ప్రత్యేకగా తీసుకునే అలోచనలో అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల తరువాత  ఈ ప్రక్రియ అంత కొలిక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

 అర్హులైన లబ్ధిదారులకు అందిస్తం.. 

నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ దిశగానే ముందుకు సాగుతున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజమైన లబ్ధిదారులకు మేలు చేస్తాం. ఎవరూ ఆపోహాలను నమ్మకూడదు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అన్ని విషయాలను వారు పరిగణలోకి తీసుకుని వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్హులైన వారందరికీ మేలు చేస్తాం.  

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే