calender_icon.png 31 October, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బ్రాంజ్

31-07-2024 12:59:01 AM

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మనూ బాకర్ రికార్డు

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ వేదికపై భారత జాతీయ జెండా మరోసారి రెపరెపలాడింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మనూ బాకర్, సరబ్‌జోత్ సింగ్ జోడీ కాంస్యంతో మెరిసింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం. ఇటీవలే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన మనూ బాకర్ మరోసారి పతకం కొల్లగొట్టి భారతావని గర్వంతో తలెత్తుకునేలా చేసింది. స్వతంత్ర భారతావనిలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మనూ బాకర్ రికార్డులకెక్కింది. అంతకముందు 1900వ సంవత్సరంలో ఇదే పారిస్ వేదికగా బ్రిటీష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ 200 మీటర్ల హార్డిల్స్, 200 మీటర్ల రేసులో రజత పతకాలు సాధించాడు.  

భారత పురుషుల హాకీ జట్టుకు రెండో విజయం 

  1. సాత్విక్ జోడీ.. దిగ్విజయంగా క్వార్టర్స్‌కు
  2. టేబుల్ టెన్నిస్‌లో రౌండ్ ఆఫ్ 16కు మనికా బాత్రా
  3. 10 మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో మనూ, సరబ్‌లకు కాంస్యం 
  4. ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ల గన్ మరోసారి పేలింది. తుపాకీ నుంచి తూటా ఎంత వేగంగా దూసుకొస్తుందో.. అంతే వేగంగా మన షూటర్ల గన్ నుంచి మరో పతకం వచ్చి దేశం ఒడిలో వాలిపోయింది. మొన్న మహిళల వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో చరిత్ర సృష్టించిన మనూ బాకర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి భారత్‌కు రెండో పతకాన్ని అందించి యావత్ దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేసింది.

స్వతంత్ర భారతావనిలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మనూ బాకర్ చరిత్రకెక్కింది. వ్యక్తిగత విభాగంలో టాప్ ప్రదర్శన కనబరచడంలో విఫలమైన సరబ్‌జోత్ సింగ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మాత్రం దుమ్మురేపే ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫుట్‌బాలర్ కావాలనుకొని షూటర్‌గా మారిన ఈ హర్యానా చిన్నోడు ఇవాళ ఒలింపిక్స్‌లో పతకం సాధించి తన పేరును చరిత్ర పుటల్లో నిలుపుకున్నాడు. రెండింటితోనే ఆగిపోకుండా ఈసారి పతకాల సంఖ్యను మన అథ్లెట్లు డబుల్ డిజిట్‌గా మార్చాలని ఆశిద్దాం..

* ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మనూ బాకర్ చరిత్ర. గతంలో 1900 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటీష్ ఇండియన్ నార్మన్ ప్రిచర్డ్ రెండు పతకాలు సాధించాడు.

* ఒలింపిక్ షూటింగ్‌లో వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లో పతకాలు సాధించిన తొలి షూటర్‌గా మనూ బాకర్ రికార్డు

విజయక్రాంతి, ఖేల్ ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం వచ్చి చేరింది. ఈసారి విశ్వక్రీడల్లో తొలి పతకం షూటింగ్ నుంచే రాగా.. రెండో పతకం కూడా మన షూటర్ల నుంచి రావడం విశేషం. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్సడ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, మనూ బాకర్ జోడీ దక్షిణ కొరియాపై విజయం సాధించిన కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

కాంస్య పతక పోరులో మనూ జోడీ 16 పాయింట్లు సాధించగా.. దక్షిణకొరియా ద్వయం లీ జంట 10 పాయింట్లకే పరిమితమైంది. దీంతో భారత్ ఖాతాలో కాంస్యం వచ్చి చేరింది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం నెగ్గని మనూ బాకర్ తాజాగా సరబ్ జోత్ కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మరోసారి కంచు మోగించింది.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్, ఎయిర్ రైఫిల్  విభాగాల్లో రమితా జిందాల్, అర్జున్ బబౌటా, అర్జున్ సింగ్ ఛీమాలు వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో నిరాశపరిచారు. అయితే 10 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో అర్జున్ బబౌటా తృటిలో పతకం చేజార్చుకున్నాడు. ఫైనల్లో అర్జున్ నాలుగో స్థానంలో నిలిచి 0.1 పాయింట్ తేడాతో కాంస్యం కోల్పోయాడు. రమితా జిందాల్ ఆశలు రేపినా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో 10 మీటర్ల పోటీల్లో భారత షూటర్ల పోటీలు ముగిశాయి. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో పోటీలు జరగాల్సి ఉంది. 

మనూ రాసిన చరిత్ర..

మనూ బాకర్.. మనూ బాకర్.. ఇప్పుడు భారత్‌లో ఎవరి నోట విన్నా ఈమె పేరే.. ఆమె ఒక్క పతకం తెస్తే చాలు అని భావించిన వారు కోకొల్లలు.. కానీ మనూ రాసిన చరిత్ర మరోలా ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగిన మనూ బాకర్ ఈసారి గట్టిగానే కొట్టాలని భావించింది. బరిలో ఉన్న మూడు ఈవెంట్లలో మనూ ఇప్పటికే రెండు పతకాలు కొల్లగొట్టింది. ఆమె స్పీడు చూస్తుంటే మూడో పతకం కొట్టి గానీ దేశానికి తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. షూటింగ్‌లో పతకం తెచ్చిన తొలి భారత మహిళగా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన మనూ... రెండు రోజులు గడువకముందే మరో పతకంతో వార్తల్లో నిలిచింది. స్వతంత్ర భారతావనిలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గానూ మనూ రికార్డులకెక్కింది.

గతంలో 1900 సంవత్సరంలో పారిస్‌లోనే జరిగిన ఒలింపిక్స్‌లో బ్రిటీష్ ఇండియన్ నార్మన్ ప్రిచర్డ్ 200 మీటర్ల హార్డిల్స్, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సాధించాడు. ఇక భారత్ తరపున స్టార్ షట్లర్ పీవీ సింధు (2016, 2020), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008, 2012).. వేర్వేరు ఒలింపిక్స్‌లో రెండేసి పతకాలు సాధించారు. ఇక మనూ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంతో సొంతపట్టణమైన సూరజ్‌కుంద్‌లోని ఆమె నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. మనూ ఆత్మవిశ్వాసమే తనను గెలిపించిందని, కోచ్ జస్పాల్ దగ్గర చేరిన తర్వాత మనూ ఆటతీరు మొత్తం మారిపోయిందని మనూ తండ్రి సంతోషంతో పేర్కొన్నాడు. ‘కూతురు రెండో పతకం సాధించిందని విన్న తర్వాత ఆనందంలో నాకు గుండెపోటు వస్తుందేమో అనుకున్నా. మనూ మ్యాచ్ చూడలేదు. నా కూతురు రెండో పతకం గెలుచుకుందని ఇరుగుపొరుగు వారు చెబితే తెలిసింది’ అని మనూ తల్లి సుమేధా పేర్కొంది. 

ఫుట్‌బాలర్ నుంచి షూటర్‌గా..

పారిస్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించడంలో విఫల మైనప్పటికీ నిరాశపడని సరబ్‌జోత్ మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్యం సాధించి చరిత్రకెక్కాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో పతకంతో మెరిసిన సరబ్ జోత్ జీవితం కాస్త ఆసక్తికరం. 2001లో సరబ్‌జోత్ సింగ్ జాట్ కుటుంబంలో జన్మిం చాడు. సరబ్‌జోత్ సింగ్ తండ్రి ఒక రైతు. హర్యానాలో పుట్టి పెరిగిన సరబ్‌జోత్ చిన్నప్పటి నుంచి ఫుట్‌బాలర్ కావాలని కలలు కన్నాడు.

కానీ 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి షూటింగ్‌పై ఇష్టాన్ని పెంచుకున్నాడు. అయితే షూటింగ్‌లో శిక్షణ ఖరీ దుతో కూడుకున్నదని తల్లిదండ్రులు మొదట భయపడ్డారు. కానీ సరబ్‌జోత్ వారికి నచ్చజెప్పి షూటింగ్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అభిషేక్ రానా మార్గదర్శకత్వంలో రాటుదేలిన సరబ్‌జోత్ శిక్షణ మొత్తం ఏఆర్ షూటింగ్ అకాడమీలోనే జరిగింది.  2019లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం సరబ్‌జోత్ కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటి వరకు అనామకుడిగా ఉన్న సరబ్‌జోత్ పసిడి సాధించడంతో ఒక్కసారిగా సీనియర్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టి వెలుగులోకి వచ్చాడు.  

సరబ్‌జోత్ సాధించిన పతకాలు:

2024 పారిస్ ఒలింపిక్స్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం

2022 ఆసియా గేమ్స్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో స్వర్ణం

2022 ఆసియా గేమ్స్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో రజతం

2023 భోపాల్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ 

వ్యక్తిగత విభాగంలో స్వర్ణం

2023 బాకు ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌లో స్వర్ణం

2023 ఆసియా చాంపియన్‌షిప్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం

2019 ఆసియా చాంపియన్‌షిప్: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో కాంస్యం

* గర్వంగా ఫీలవుతున్నా. గేమ్ చాలా కఠినంగా సాగడంతో ఒత్తిడిగా ఫీలయ్యాం. మనూ బాకర్‌తో నా కాంబినేషన్ కుదిరింది. ఒలింపిక్ ఫోడియంపై ఇద్దరం కలిసి పతకం అందుకోవడం మరిచిపోలేని అనుభూతి. చాలా సంతోషంగా ఉంది 

 సరబ్‌జోత్, భారత షూటర్

* గేమ్‌లో తొలుత తడబడ్డాం. కానీ ఇద్దరం బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించాం. మొన్న వ్యక్తిగత విభాగంలో.. ఇవాళ టీమ్ విభాగంలో పతకం సాధించడం సంతో షంగా ఉంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పతకం సాధించడమే లక్ష్యం.

 మనూ బాకర్, భారత షూటర్

* గతంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (2016,2020), రెజ్లర్ సుశీల్ కుమార్ (2008--,2012)..వేర్వేరు ఒలింపిక్స్‌లో రెండేసి పతకాలు సాధించారు.

మనూ కొత్త చరిత్ర

భారత్ తరఫున ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి కొత్త చరిత్ర లిఖించావు. సరబ్ నీకు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు దక్కాలి’

 ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి

మన షూటర్లు గర్వపడేలా..

మన షూటర్లు దేశం గర్వపడేలా చేస్తున్నారు. మిక్స్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యపతకం నెగ్గిన మనూ బాకర్, సరబ్‌జోత్ సింగ్‌లకు శుభాకాంక్షలు. 

 నరేంద్ర మోదీ, భారత ప్రధాని

మీ కృషికి ప్రతిఫలం దక్కింది

మీ శ్రమ, అంకిత భావానికి తగిన ప్రతిఫలం లభించింది. మీరు సాధించిన విజయం పట్ల మొత్తం దేశం గర్వపడుతోంది 

రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేత 

కంగ్రాట్స్ మనూ, సరబ్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో మెడల్ అందించిన షూటర్లు మనూ బాకర్, సరబ్‌జోత్‌లకు అభినందనలు. మనూ ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర రాశావ్’

 సచిన్ టెండూల్కర్

మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది

మనూ బాకర్, సరబ్‌జోత్ మీ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా ఉంది. మీరు సాధించింది మామూలు విజయం కాదు.

భినవ్ బింద్రా

మనూ దేశానికే గర్వకారణం 

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటిం గ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మనూ బాకర్,  సరబ్‌జోత్ జోడీ కాంస్యం గెలవడం దేశానికి గర్వకారణం.     

కిషన్ రెడ్డి

నేడు ఒలింపిక్స్‌లో భారతీయం

షూటింగ్: 50 మీ రైఫిల్ 3 

పొజీషన్స్ పురుషుల 

క్వాలిఫికేషన్: ఐశ్వరీ ప్రతాప్ సింగ్, స్వప్నిల్

మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్: శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి

బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్ : పీవీ సింధు x క్రిస్టియన్ కుబా (ఎస్తోనియా)

పురుషుల సింగిల్స్ : లక్ష్యసేన్ x  జొనాథాన్ 

ప్రణయ్‌x డక్ ఫాట్ లే 

టేబుల్ టెన్నిస్: మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32: 

ఆకుల శ్రీజ x జియాన్ జెంగ్ 

బాక్సింగ్: మహిళల 75 కేజీల రౌండ్ ఆఫ్ 16: 

లవ్లీనా x సున్నివా హాఫ్‌స్టడ్ 

పురుషుల 71 కేజీల రౌండ్ ఆఫ్ 16: నిషాంత్ x గాబ్రియెల్ 

ఆర్చరీ: మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: 

దీపికా కుమారి x రీనా 

పురుషుల వ్యక్తిగత 1/32 

ఎలిమినేషన్ రౌండ్: 

తరుణ్‌దీప్ x టామ్ హల్ 

ఈక్వెస్ట్రియన్: డ్రెస్సేజ్ వ్యక్తిగత గ్రాండ్ పిక్స్ డే2: అనుష్ 

అగర్వాలా

పతకాల పట్టిక

దేశం స్వ కా మొత్తం

జపాన్ 7 ౧3

చైనా 6 6 2 14

ఫ్రాన్స్ 5 8 4 17

ఆస్ట్రేలియా 5 4 0 9

కొరియా 5 3 1 9

భారత్ 0 0 2 2

నోట్: స్వే ర కా