బుమ్రా, మంధనలకు ఐసీసీ అవార్డులు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవార్డుల్లో భారత ఆటగాళ్లు డబుల్ దమాకా మోగించారు. టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ నెలకు గానూ ఈ ఇద్దరు అవార్డు గెలుచుకున్నట్లు సోమవారం ఐసీసీ వెల్లడించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో పేసర్ బుమ్రా కీలకపాత్ర పోషించాడు.
8 మ్యాచ్‌ల్లో బుమ్రా 4.17 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. ఇక దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో హోరెత్తించిన స్మృతి మంధన తొలిసారి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు గెలుచుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి రెండు వన్డేలో సెంచరీలతో కదం తొక్కిన మంధన మూడో వన్డేలోనూ సెంచరీకి చేరువగా వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఏకైక టెస్టులోనూ మంధన (149 పరుగులు) శతకంతో మెరిసింది.