calender_icon.png 10 October, 2024 | 6:52 AM

వసతి గృహాలా.. కోళ్ల ఫారాలా?

10-10-2024 02:30:23 AM

 కార్పొరేట్ జూనియర్ కాలేజీ హాస్టళ్ల దుస్థితి 

విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువు

ఒక్కో గదిలో ఐదు నుంచి పది మంది బస 

రాష్ట్రంలో ౭౦౦ కాలేజీలకు అనుమతి లేని హాస్టళ్లు?

రాష్ట్రంలో ఏటా రూ.౫ వేల కోట్ల విద్యా వ్యాపారం 

నిద్రావస్థలో అధికార యంత్రాంగం

హైదరాబాద్, అక్టోబర్ ౯ (విజయక్రాంతి): ‘కాలేజీలోని ఒక్క రూమ్‌లోనూ కిటికీలు లేవు.. ఒక్కో గదిలో పది మంది.. ఎక్కడా శుభ్రత లేదు.. విద్యార్థులు జైలులో ఉన్నట్టు ఉంది’ అని కార్పొరేట్ కాలేజీల్లోని వసతులపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల చేసిన వ్యాఖ్యలివి.

విశాలమైన భవనాలను చూపిస్తున్నప్పటికీ ఇరుకిరుకు హాస్టల్ గదులు, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు ఎక్కడా కనిపించట్లేదు. ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్ యాజమాన్యాలు పశువుల కంటే హీనంగా విద్యార్థులను ఇరుకు గదుల్లో ఉంచుతున్నారు. చిన్న గదుల్లో ఐదు నుంచి పది మందికి సరిపడా బెడ్లు ఉంటున్నాయి.

కాస్త పెద్ద గదుల్లోనైతే 15 వరకు బెడ్లు వేస్తున్నారు. సరిపడా ఫ్యాన్లు, కిటికీలు ఉండవు. అందులోనే పుస్తకాలు, లగేజీ పెట్టుకుంటున్నారు. కొన్ని కాలేజీల్లోనైతే విద్యార్థులుండే గదులకు కనీసం వెంటిలేషన్ ఉండటంలేదు. వాష్ రూములకు సరిగా డోర్లు ఉండవు. ఆ కాలేజీల్లోని మహిళా హాస్టళ్లయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.

సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని ఓ రెండు కార్పొరేట్ ఇంటర్ కాలేజీల (ఉమెన్స్)ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కాలేజీల్లోని సౌకర్యాలపై స్వయంగా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారంటే కార్పొరేట్ కాలేజీల్లోని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోచ్చు. నగరంలోని చాలా కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉంది. అధికారులకు అన్ని తెలిసినా.. తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరించడం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా.. 

జూనియర్ కాలేజీలను నడుపుకొనేందుకు మాత్రమే ఇంటర్ బోర్డు నుంచి అనుమతి ఉంటుంది. హాస్టళ్లు, అకాడమీలు జిల్లా విద్యాధికారి నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఎక్కడా అధికారుల నుంచి అనుమతి తీసుకోవడంలేదు. కళాశాల ప్రాంగణాల్లో హాస్టళ్లను నడిపేందుకు వీలులేదు.

అయినా, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్పొరేట్ కాలేజీలు వాటికి అనుబంధంగా హాస్టళ్లను యథేచ్ఛగా నడిపిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1800కు పైగా ప్రైవేట్ కాలేజీలుంటే అందులో 700 వరకు కాలేజీలు అనుమతుల్లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

ఒక్కో విద్యార్థి నుంచి హాస్టల్ ఫీజే నెలకు కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. కాలేజీ, హాస్టల్ ఫీజు కలిపి కనీసం రూ.లక్షన్నర నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని కాలేజీలైతే ఇంకా ఎక్కువే. ఏసీ, సెమీ ఏసీ, నాన్ ఏసీ పేర్లతో రూములుంటాయి. ఈ తరహా ఫీజుల దోపిడి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే ఎక్కువగా ఉంది. ఇతర జిల్లాల్లో ఉన్నప్పటికీ ఇక్కడితో పోల్చుకుంటే కాస్త తక్కువే.

ఏటా వేల కోట్లలో వ్యాపారం 

ఇంటర్ విద్య పేరుతో రాష్ట్రంలో వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. పిల్లల చదువులనగానే తల్లిదండ్రులు ఆలోచించకుండా లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకొని కొన్ని కార్పొరేట్ కాలేజీలు డబ్బులు దండుకుంటున్నాయి. ఏటా సుమారు రూ.5 వేల కోట్ల వ్యాపారం జరగుతోందని అంచనా. అయినా, విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారా? అంటే అదీలేదు.

ఆహారంలో నాణ్యత ఉండదు, పరిశుభ్రత పాటించడంలేదు. మధ్యాహ్నం పెట్టగా మిగిలే కూరలు, సాంబారు, అన్నాన్ని సాయంత్రం పూట అదే విద్యార్థులకు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ కేసులు కూడా నమోదవుతున్నాయి.

అసలు ఈ హాస్లళ్ల నిర్వహణపై అధికారులు పట్టించుకోవడంలేదు. తమ పరిధి కాదన్నట్టు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా కనీస సౌకర్యాలు కల్పించకుండా కొన్ని కాలేజీలు ఫీజులను ఇబ్బడిముబ్బడిగా దండుకుంటున్నాయి.

లక్షల్లో ఫీజులు వసూలు చేసి సౌకర్యాలు కల్పించడంలేదు

శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు అనుమతి లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర మహిళా కమి షనే వెళ్లి తనిఖీ చేస్తే వాటి నిర్వహణ ఎలా ఉందో బయటికి తెలిసింది. విద్యార్థులకు కనీసం సౌకర్యాలు ఉండవు కానీ, ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణకు అనుమతి ఉండదు. తరగతి గదులు, హాస్టళ్లు జైళ్ల కంటే అధ్వానంగా ఉంటున్నాయి. వెలుతురు, గాలి రాక విద్యార్థులు కోళ్లఫామ్‌ల్లోలా మానసిక వేదనకు గురవు తున్నారు. తనిఖీల్లేక ఇష్టారాజ్యంగా కా లేజీలు వ్యవహరిస్తున్నాయి.  వెంటనే చ ర్యలు తీసుకొని హాస్టళ్లను సీజ్ చేయాలి.

కసిరెడ్డి మణికంఠ రెడ్డి, 

ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు