01-03-2025 01:26:37 AM
జనగామ, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): నీళ్లు లేక వరి పంటలు ఎండుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. చెరువులు, కాల్వలను నింపి తమ పొలాలకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామస్తులు జనగామ హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ఎండిపోయిన వరితో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి ప్రతీ ఏటా వచ్చే నీరు ఈసారి ఆగిపోయిందన్నారు. డ్యాం నుంచి కాల్వలకు, చెరువులకు నీరు అందకపోవడంతో వరినాట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పొట్ట దశలో ఉన్న పంట నీళ్లు లేక ఎండిపోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా వడ్లకొండలోని ఏన చెరువును నింపాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లబోయిన హరీశ్, నామాల భాస్కర్, కస జగన్, కాసర్ల అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.