15-04-2025 12:08:19 AM
అందాల భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన ‘హరిహరవీరమల్లు’, ‘ది రాజాసాబ్’ చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇవి తప్ప ఆమె చేతిలో ఉన్న సినిమాలేవీ లేనట్టుంది. ఇందుకు కారణాలు ఏమైనా.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్ నుంచి వరుస సినిమాలు రాకపోవడంపై ఓ నెటిజన్ విమర్శనాత్మక వ్యాఖ్య చేశాడు.
నిధి తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటి శ్రీలీల ఫిల్మోగ్రఫీతో పోలుస్తూ వ్యంగ్యంగా ఎక్క్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘2019లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆమె ఏం చేసింది? ఎన్ని సినిమాలు చేసింది? 2021లో వచ్చిన శ్రీలీలను చూడండి 20 సినిమాలు చేసింది” అంటూ అతడు రాసుకొచ్చిన పోస్ట్ నిధి కంట పడింది. దీంతో ఆమె తనదైన శైలిలో అతన్ని సమాధానపరిచింది. తన గురించి ఏమాత్రం బాధపడొద్దంటూ అతన్ని కోరింది. ‘మంచి స్క్రిప్ట్‌లు అని నమ్మిన తర్వాతే అలాంటి వాటికే నేను సంతకం చేస్తున్నా.
ఈ విషయంలో టైమ్ తీసుకుంటున్నా.. అయితే, ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో నేను కొన్ని సార్లు తప్పు అయి ఉండొచ్చు అది వేరే విషయం. కానీ, నా అభిప్రాయమల్లా మంచి సినిమాల్లోనే భాగం కావాలన్నదే! వరుస సినిమాలు చేసేయాలనే తొందర నాకేమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే.. నేను ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి, బ్రదర్.. నా గురించి నువ్వు ఏమీ బాధపడకు” అని ఆమె రిప్లు ఇచ్చింది.