calender_icon.png 25 February, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క చుక్క పోవద్దు

25-02-2025 01:32:16 AM

  1. శ్రీశైలం నుంచి నీటి వినియోగాన్ని ఏపీ ఆపాల్సిందే
  2. ఇప్పటికే ఆ రాష్ట్రం ఎక్కువ నీటిని వాడుకుంది
  3. కేఆర్‌ఎంబీకి స్పష్టం చేసిన తెలంగాణ సర్కార్ 
  4. రేపు కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం 

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కేటాయించిన దానికంటే ఎక్కువ గానే ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను వాడుకుందని, ఇకపై చుక్కనీరు కూడా తరలించుకుపోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేఆర్‌ఎంబీకి  తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిం ది. కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో సోమ వారం జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్, ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకున్నందున.. నీటి తరలింపును నిలువరించాలని తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బోర్డు చైర్మన్‌ను కోరారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, తదితర ఔట్‌లెట్ల నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తిగా ఆపేలా చూడాలన్నారు. తాగునీటి అవసరాల కోసం తమకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో 10 టీఎంసీల చొప్పున అందుబాటులో ఉంచాలని కోరారు.

సముద్రంలోకి వృథాగా పోయే వరద నీటిని తాము వినియోగించుకున్నామని, అందుకే దీన్ని పరిగణనలోకి తీసుకోవద్దం టూ ఏపీ ఈఎన్సీ వాపోయారు. సాగర్, శ్రీశైలం కింద పంటలు ఉన్నాయని, వాటికి సరిపడా నీరు అవసరమని పేర్కొన్నారు. సాగ ర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న పంటలను దృష్టిలో ఉంచుకొని నీటి అవసరాలపై 2 రాష్ట్రాల సంబంధిత చీఫ్ ఇంజనీర్లు మంగళవారం సమావేశమై ఓ అభిప్రాయానికి రావాలని కేఆర్‌ఎంబీ చైర్మన్ సూచించారు.

ఈ భేటీ తర్వాత బుధవారం కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమై నీటి విడు దల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేఆర్‌ఎంబీ సమావేశంలో వరదజలాల వినియోగానికి సంబంధించిన లెక్కలు తీసినట్టు తెలిసింది. నల్లగొండ సీఈ అజయ్‌తో అధికారులు మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో ఉన్నందున అందుబాటులోకి రాలేదు.

దీంతో ఏపీ సీఈని మంగళవారం నల్లగొండ వెళ్లి అక్కడే మాట్లాడాలని సూచించారు. ఆ తర్వాత బుధవారం జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు విడిగా సమావేశమయ్యారు. 

ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల్లో తెలంగాణకు 131, ఆంధ్రప్రదేశ్ కు 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల11వ తేదీ వరకు నాగార్జునసాగర్‌లో 63 టీఎంసీలు (510 అడుగులపైన), శ్రీశైలంలో 30 టీఎంసీల  (834 అడుగుల పైన) నీరు మిగిలి ఉంది.

రెండు జలాశయాల్లో నీటి నిల్వలు, జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ ఔట్‌లెట్ల నుంచి నీరు తీసుకొనే ప్రణాళిక వివరాలు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటోందని, తెలంగాణ కేఆర్‌ఎంబీ, కేంద్ర ప్రభుత్వానికి ఇటీవలే ఫిర్యాదు కూడా చేసింది.