calender_icon.png 8 January, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు తీరికే లేదా?

04-01-2025 02:22:33 AM

  • ‘మార్గదర్శి’ కేసులో 13 వాయిదాలు ముగిశాయి..
  • కౌంటర్ దాఖలుకు ఇంకెన్నాళ్ల సమయం కావాలి ?
  • చివరగా మూడువారాల సమయం ఇస్తామని స్పష్టీకరణ
  • లేదంటే రెండు రాష్ట్రాల సీఎస్‌లు విచారణకు రావాల్సిందే: హైకోర్టు

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ‘సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్ నిబంధనల ఉల్లంఘన కేసును గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు 13 వాయిదాలు ముగిశాయి. అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసే తీరిక లేదా?’ అంటూ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంకెన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రశ్నించింది. చివరిసారిగా ౩ వారాల గడువిస్తున్నట్లు పేర్కొన్నది. ఈసారి కూడా కౌంటర్ దాఖలు చేయకపోతే రెండు రాష్ట్రాల సీఎస్‌లు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణను ఈ నెల 31కు వాయిదా వేసింది. 

ఈలోపు అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జి.రాధారాణి ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు కంపెనీ కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని 2018లో నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పెద్దలు సుప్రీం కోర్టులో వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేస్తూ గతేడాది గతేడాది ఏప్రిల్ 9న తీర్పు ఇచ్చింది. ఈ వివాదంపై విచారణ పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్నికల కేసును కొట్టేయండి

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిటిషన్ 

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాపై నమోదైన కేసును కొట్టేయండి’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ 2023 నవంబర్ 29న కమలాపూర్ ఎంపీడీవో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై కేసు పెట్టారు. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు పరిగణలోకి తీసుకుంది. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ శుక్రవారం ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘మీరు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలను చూస్తారు. మీరు ఓటు వేసి భారీ విజయాన్ని కట్టబెడతానంటేనే విజయయాత్రకు వస్తా.

లేదంటే మా శవయాత్రకు రండి’ అని ఎమ్మెల్యే ప్రసంగించారని ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని పిటిషనర్ తప్పుబట్టారు. తాను ప్రసంగించినట్లు ఉన్న వీడియో ఆధారంగా కేసు నమోదు చెల్లదని, సీడీ ఆధారంగానే ఎంపీడీవో ఫిర్యాదు చేశారన్నారు. పోలీసుల చార్జిషీట్‌లోనూ సీడీ ప్రస్తావన లేదన్నారు. ఫిర్యాదుకు సీడీ ఒక్కటే ఆధారమని, దాన్ని మాత్రం కోర్టుకు సమర్పించలేదన్నారు.

చార్జిషీట్ ఆధారంగా నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ కేసులో కేవలం ఐదారుగురు సాక్షులను మాత్రమే విచారించారని, వారంతా అధికారులేనని, సాక్షుల్లో ఒక్క ఓటరు కూడా లేరన్నారు.

తాను ఎలాంటి నేరం చేయలేదని, అయినప్పటికీ తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారన్నారు. రాజకీయ కక్షతోనే కేసు బనాయించారన్నారు. ఇప్పటికైనా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులోని కేసును కొట్టివేయాలని ఎమ్మెల్యే కోర్టును కోరారు.