calender_icon.png 23 February, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైట్ తీస్కోకండి!

23-02-2025 12:30:19 AM

రేఖ, నరేశ్ ఐదారేళ్లుగా ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. అభిప్రాయ బేధాలు, వ్యక్తిగత విషయాలు.. కారణాలు ఏమో కాని విడిపోయారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే రేఖపై ట్రోలింగ్ మొదలైంది. ఆమె వ్యక్తిగత ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా రేఖ ఒక్కరే కాదు.. చాలామంది అమ్మాయిలు, మహిళలు ట్రోలింగ్ బారిన పడుతున్నారు. అయితే ట్రోలింగే కదా అని లైట్‌గా తీసుకోకండి. 

ట్రోల్స్ వల్ల మానసికంగా ఎంతగానో నలిగిపోతుంటారు. నిజానికి ఆన్‌లైన్‌లో ఇతరుల మీద బురద చల్లేవారు తమ నిజజీవితంలో ‘ఐడెంటిటీ క్రైసీస్’తో బాధపడుతుంటారు. ఏదోవిధంగా అందరూ తమను గుర్తించాలి అనే ఆలోచనతో ఉంటారు.

ఎవరికైనా ప్రాముఖ్యం పెరుగుతుందని అనిపిస్తే వారిని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లైక్‌లు, కామెంట్లు, షేర్స్ కోసం అవతలివారు మనిషి అని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది ఒకరకమైన మానసిక లోపం అని అంటున్నారు సైకాలజిస్టులు. 

అనేక రకాలుగా.. 

ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. దాంతో నెట్ వినియోగం ఎక్కువగా పెరిగింది. పక్కపక్కనే కూర్చున్నా.. స్టేటస్‌తో, అప్డేట్లు, పోస్టులతో పలకరింపులు చేసుకునే కాలం మరి. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా వాడకం పెరిగింది. తమ ఇంట్లో జరిగే ప్రతివిషయాన్నీ ఆన్‌లైన్‌లో పంచుకుంటున్నారు. దాంతో ప్రేమ, అభిమానం, కోపం, ద్వేషం.. ఇలా అన్నింటినీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రదర్శిస్తున్నారు.

నచ్చనివారిని సూటి పోటి మాటలతో వేధిస్తున్నారు. ఫేక్ ప్రచారాలతో మానసికంగా హింసిస్తున్నారు. పదునైన విమర్శలతో దాడిచేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఇతరులను రెచ్చగొడుతున్నా రు. అవతలివారిని బాధపెట్టడం, కోపం తెప్పించడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంతేనా.. చంపేస్తామని బెదిరింపులు, అవమానించడం, విద్వేషపూర్వకమైన కామెం ట్లు, మీమ్స్ లాంటివన్నీ చేస్తున్నారు. 

మహిళలే ఎక్కువ

మనదేశంలో 75 కోట్లమందికిపైగా సా మాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారంటోంది ఓ సర్వే. అయితే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతోంది మాత్రం మహిళలేనట. ముఖ్యంగా ఆడవారి శరీరాకృతి, అందం, ఆహార్యం వంటివాటిపై జరిగే ట్రోల్స్ ఆందోళన, నిరాశ, ఆత్మన్యూనత బారినపడేలా చేస్తున్నాయి. సామాజిక భాగస్వామ్యాన్ని తగ్గిస్తున్నాయి.

ఈ ట్రోలింగ్ వల్ల మహిళలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి కూడా భయపడుతున్నారట. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ఈ ట్రోల్స్ బాధితులే. చాలామంది ఈ ట్రోల్స్ నుంచి బయటపడేందుకు మానసికంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ట్రోలింగ్ ప్రభావం వల్ల ఆయా రంగాల్లో రాణించే మహిళల సంఖ్య కూడా తగ్గుతున్నది.

ఫిర్యాదు చేయండి

ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, స్నాప్‌చాట్.. మాధ్యమం ఏదైనా ప్రైవసీ సెట్టింగ్స్ ఉన్నాయి. మన ప్రొఫైల్‌ను ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు.. ఇలా లాకింగ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా కొంతవరకూ రక్షణ పొందవచ్చు.

సమస్య తీవ్రమవుతుంటే సంబంధిత ఖాతాల వివరాలు, ఆధారాలతో సహా స్థానికంగా ఉన్న సైబర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చు. 

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అబద్ధపు ప్రచారాలు, వదంతులు, దూషణలు చూసి కుంగిపోవద్దు. ఆ బాధనుంచి బయటపడటానికి అవసరమైతే మానసిక నిపుణుల సాయం తీసుకోండి.