18-04-2025 12:52:24 AM
బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపు
ఖమ్మం , ఏప్రిల్, 17 ( విజయక్రాంతి ):-బీఆర్‌ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు పాలేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కదం తొక్కాలని.. గులాబీ సైన్యం కవాతుతో వరంగల్ దద్ధరిల్లాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
రజతోత్సవ సభకు సన్నాహకంగా గురువారం సాయంత్రం తిరుమలాయపాలెం లో పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలన కేవలం ఏడాది లోనే ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, బీఆర్‌ఎస్ ను దూరం చేసుకుని తాము ఏం కోల్పోయామో ప్రజలంతా గ్రహించారని అన్నారు. రేవంత్ సర్కార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో అత్యుత్సాహం ప్రదర్శించి, అడవులను ధ్వంసం చేసి సుప్రీంకోర్టు చీవాట్లు తినాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం చూపి.. కేసులు పెట్టి నిర్భంధాలకు గురిచేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు.
వరంగల్ సభ తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించబోతోందని, సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి కమిటీల నియామకం జరపబోతోందని అన్నారు. రజతోత్సవ సభను సక్సెస్ చేయడంలో పాలేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులు ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు.
పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు రాజకీయాలకు అతీతంగా, ఎవరు వచ్చినా పనులు చేశామని గుర్తు చేశారు.. సభలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు సూధన్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బాషబోయిన వీరన్న, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, మాజీ ఎంపీపీలు బెల్లం ఉమా, మాజీ జెడ్పీటీసీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.