calender_icon.png 30 November, 2024 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగ్ సిఫార్సులపై అలసత్వం వద్దు

29-10-2024 02:16:54 AM

  1. అసెంబ్లీ కమిటీల సిఫార్సులు చాలా వరకు పెండింగ్  
  2. అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అరికెపూడి గాంధీ  

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం చైర్మన్ అరెకపూడి గాంధీ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ హాల్లో జరిగింది. శాసన మండలికి కాగ్ సమర్పించే నివేదికలు, పీఏసీ పరిశీలించిన ఆడిట్ పేరాలు, కాగ్ గమనించిన అంశాలపై అధికారులు ఇచ్చే వివరణలు ఇవ్వడంపై సమావేశంలో చర్చించారు.

32 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 2024, సెప్టెంబర్ 30 నాటికి కాగ్ నివేదికల ప్రకారం తెలంగాణకు సంబంధించి 302 ఆడిట్ పేరాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 202 ఆడిట్ పేరాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఆడిట్ పేరాలు, కమిటీ చేసిన సిఫార్సులను సంబంధించి వివరణాత్మక నోట్స్, చర్యా నివేదికలు సకాలంలో కమిటీకి అందజేస్తామన్నారు.

సంబంధిత శాఖల కార్యదర్శులు తమ శాఖాధిపతుల వద్ద పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే క్లియర్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. లెజిస్లేచర్ సెక్రటేరియట్ సమన్వయంతో నోడల్ ఆఫీసర్స్‌ను నియమించి తాను కూడా ప్రతి నెలా సమీక్షా సమావేశాలు నిర్వహించి, ఇప్పటీ వరకు అందజేయాల్సిన నోట్స్, చర్యా నివేదికలపై చర్యలు తీసుకుంటామని సీఎస్ పేర్కొన్నారు.

అకౌంటెంట్ జనరల్  పీ మాధవి మాట్లాడుతూ.. కాగ్ రిపోర్టుల్లోని ఆడిట్ పేరాలను పరిశీలించి అవసరమైన సిఫార్సులు చేయడంలో తమ వైపు నుంచి అవసరమైన సలహాలు కమిటీకి అందిస్తామన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పీఏసీ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, రామారావు పవార్, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ వాకౌట్.. 

పీఏసీ చైర్మన్ నియామకంపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ సమావేశాన్ని వాకౌట్‌చేశారు. పీఏసీ చైర్మన్ పదవిని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనవాయితీగా వస్తోందని అన్నారు.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు పేరును ప్రతిపాదించగా, ఆయన్ను కాదని గాంధీకి ఇచ్చారు.