calender_icon.png 16 November, 2024 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పాటలు పాడొద్దు

16-11-2024 02:16:46 AM

డ్రగ్స్, మద్యాన్ని ప్రోత్సహించే పదాలు వినియోగించవద్దు

పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్‌కు 

తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

న్యూఢిల్లీ, నవంబర్ 15: ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసా ంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు పంపింది. శుక్రవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో దిల్ ల్యుమినాటి మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో మద్యం, డ్రగ్స్‌ను ప్రోత్స హించేలా ఎలాంటి పాటలు పాడొద్దని అందులో హెచ్చరించింది.

దోసాంజ్ సంగీత కచేరీల్లో ఈ అంశాలపైనే పాటలు పాడటం సర్వ సా ధారణం. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే హింసను ప్రోత్సహించే పాటలను సైతం పాడొద్దని, ప్రదర్శనలో పిల్లలను ఉపయోగించవద్దని నోటీసుల్లో పేర్కొంది. పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించే డీజే, ఫ్లాషింగ్ లైట్లు వాడకూడదని స్పష్టం చేసింది. 

వీడియో ఆధారాలతో..

గతంలో దోసాంజ్ డ్రగ్స్, మద్యంపై పాడిన పాటల వీడియో ఆధారాలను చండీగఢ్ కోర్టుకు చెందిన పండిత్‌రావ్ ధరేన్వర్ సమర్పించిన నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియం, జైపూర్‌తో పాటు పలు అంతర్జాతీయ వేదికలపైనా దిల్ ల్యుమినాటి కన్స ర్ట్‌లో దిల్జీత్ ఇలాంటి పాటలే పాడారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల వీడి యోలను నోటీసులకు జతచేసి అందజేశారు.

దిల్ ల్యుమినాటి ప్రదర్శన దేశవ్యా ప్తంగా 11 నగరాల్లో గత నెల 26న ప్రారంభమైంది. ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించనున్నారు. టికెట్లు సైతం భారీగా అమ్ముడయ్యాయి.