calender_icon.png 31 October, 2024 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులను ఆగం చేయొద్దు

07-07-2024 01:38:50 AM

రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టొద్దు..

నిరుద్యోగులపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, జూలై 6: బీఆర్‌ఎస్, బీజేపీ నిరుద్యోగులను ఆగం చేయొద్దని, రాజకీయ లబ్ధికోసం యువతను రెచ్చగొట్టొద్దని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ హితవు పలికారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నిరుద్యోగులను పట్టించుకోకుండా, ఇప్పుడు వారి సమస్యల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ యువతను రెచ్చగొట్టిందని, కొందరిని ఆత్మహత్యలకు పురిగొ ల్పిందని ఆరోపించారు.

ఇప్పుడు కూడా అదే రీతిలో నిరుద్యోగులను తన రాజకీయాల కోసం బలి పెడుతున్నదని విమర్శించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన బీఆర్‌ఎస్, రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం పోటీ పరీక్షలైనా సక్రమంగా నిర్వహించలేదని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీపై నిపుణుల కమిటీ నివేదికను సైతం పక్కన పెట్టన ఘనత నాటి సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. పదేళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉండి, మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల కోసం ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పటికే అనేక  ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిందని, 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిందన్నారు. గ్రూప్స్‌తో పాటు డీఎస్సీ, ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందన్నా రు. త్వరలో జాబ్ కాల్యెండర్ విడుదల చేస్తుందన్నారు. నిరుద్యోగులు బీఆర్‌ఎస్, బీజేపీని నమ్మి మోసపోవద్దని సూచించారు.