16-02-2025 12:38:38 AM
* కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేండ్లలో బీఆర్‌ఎస్‌పై వచ్చినంత వ్యతిరేకత రేవంత్ సర్కారు ఏడాదిలోనే మూటగట్టుకుంది. ఎన్నికల హామీల అమలులో దారుణంగా విఫలమైంది. ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై బీఆర్‌ఎస్ నోరు విప్పడంలేదు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి కుల రాజకీయాలు మానుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 1994లో కాంగ్రెస్ హయాంలోనే మోదీ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చారని సీఎం గుర్తుపెట్టుకోవాలన్నారు.
వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడారు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్‌పై వచ్చినంత వ్యతిరేకత రేవంత్ సర్కారు ఏడాదిలోనే మూటగట్టుకుందని చెప్పారు.
ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, అమలు చేసేంత వరకు సర్కార్‌ను వదలబోమని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించాల్సిన విపక్ష బీఆర్‌ఎస్ నోరు విప్పడంలేదని ఆక్షేపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మండలి ప్రాధాన్యం పూర్తిగా తగ్గించి తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించిందని మండిపడ్డారు.
2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో రాగానే పట్టించుకోవడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పత్రికల్లో తేదీలవారీగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందని ప్రశ్నించారు. డీఎస్పీ నిర్వహణపై సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ పాఠశాలలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసాకార్డు ఏమయ్యాయని నిలదీశారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించలేక సర్కారు చేతులెత్తేసిందన్నారు.
గురుకులాల్లో విద్యార్థుల మరణాలు పెరిగాయని, తినే తిండి సైతం కలుషితమవుతున్నా ప్రభుత్వానికి సోయిలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు అసంతృప్తిలో ఉన్నాయని, ఏడాదిలో అభయహస్తం కాస్త రిక్తహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు.
కేంద్రం ఎంతో చేసింది..
తెలంగాణ రాష్ట్రాభివృద్దికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. జహీరాబాద్‌లోని ఇండస్ట్రీయల్ కారిడార్, వరంగల్ మెగాటెక్స్‌టైల్ పార్క్, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రామగుండంలో యూ రియా ఫ్యాక్టరీకి కేంద్రమే నిధులిచ్చిందని వెల్లడించారు.
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సైతం లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో 80 వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రైల్వేల అభివృద్ధికి రూ.84వేల కోట్లు, మెట్రోకు రూ.1,200 కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. ప్రతిష్ఠాత్మక వంద మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు తెలంగాణకు తెచ్చామని తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి..
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యా య ఎమ్మెల్సీ స్థానం నుంచి సర్వోత్తంరెడ్డి, కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నా రని, కరీంనగర్- నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి అం జిరెడ్డి పోటీలో ఉన్నారని.. వారిని భారీ మెజార్టీతో గెలిపిం చాలని కిషన్‌రెడ్డి అభ్యర్థించారు.
కొందరు అతితెలివి ప్రదర్శిస్తున్నారు..
బీజేపీలో కొందరు అతితెలివి చూపుతున్నారని, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఉద్దేశించే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది.