మంది ఎక్కువైతే తప్పా అందరినీ కలుస్తా
గౌరవెల్లిని కంప్లీట్ చేస్తా.. పరిశ్రమలు తెస్తా
ప్రజాపాలన, ప్రజావిజయోత్సవాల సభలో మంత్రి పొన్నం
హుస్నాబాద్, నవంబర్ 25: ‘మంత్రి వస్తే ప్రజలను కలవడు. ఆయన వద్దకు వెళ్తే దొరకడు అనే మాట వినిపిస్తోంది. అలాంటి మాటే రావద్దు. మంది ఎక్కువైతే తప్ప అందరినీ కలుస్తా. అందరి సమస్యలూ వింటా’ అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభలో మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలుపు తాన్నారు.
కుర్చీ వేసుకొని గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను కడతామన్నోళ్లు పదేండ్లునా పట్టించుకో లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్ పెండింగ్ పనుల కోసం రూ.433 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాల్వలు నిర్మించేందుకు మూడు జిల్లాల కలెక్టర్లతో భూసేకరణ పనులు నడుస్తున్నట్టు చెప్పారు. ప్రాజెక్టు కంప్లీట్ చేసి నీళ్లు ఇవ్వడంతోపాటు పరిశ్రమలను నెలకొల్పుతామ న్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్ ఏడాది పాలనలోనే సంబురంగా ఉన్నారన్నారు.
ఇప్పటికే రూ.2 లక్షల లోపు రైతుల రుణమాఫీ పూర్తిచేశామన్నారు. ఆపైన ఉన్నవారికి త్వరలోనే అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గురుకుల విద్యార్థులు అనేక ఇక్కట్లు పడ్డారన్నారు. తామ పార్టీ అధికారంలోకి వచ్చాక డైట్, కాస్మోటిక్ చార్జీలు 40 శాతం పెంచి, వారి బాగోగులు చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ మనూచౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.