calender_icon.png 26 October, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మా పేరుతో మా బతుకులను ఆగం చేయొద్దు

26-10-2024 12:24:09 AM

  1. జీవనాధారమైన భూములను లాక్కుంటే ఊరుకోం
  2. రోటిబండ తండాలో భూ నిర్వాసితుల ఆందోళన
  3. కాంగ్రెస్ దుద్యాల మండలాధ్యక్షుడి నిర్బంధం
  4. రైతులు ఆందోళన విరమించాలని చేతులు జోడించి వేడుకున్న ఎస్సై

కొడంగల్, అక్టోబర్ 25: ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి మా బతుకులను ఆగం చేయొద్దని భూ నిర్వాసితులు నినదించారు. తమ జీవనాధారమైన భూములను లాక్కొ ని కంపెనీలు ఏర్పాటు చేస్తామంటే ఊరుకోమని స్పష్టం చేశారు. కొడంగల్ నియోజక వర్గంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీలకు అవసరమైన భూ సేకరణను అధికారులు ప్రారంభించారు.

ఇందులో భాగంగా భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయా లు సేకరించేందుకు శుక్రవారం కొడంగల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులతో బొమ్మారాస్‌పేట మండలం లగచర్లలో సమావేశం అయ్యేందుకు కలెక్టర్ ప్రతీక్‌జైన్ నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలేపల్లి, దుద్యాల, లగచర్ల, హకీంపేట, ఈర్లపల్లి తండాకు చెందిన భూ నిర్వాసితులు రోటిబండ తండాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

తమ భూములు ఫార్మా కంపెనీలకు ఇచ్చేది లేదంటూ నినదించారు. కాగా, కలెక్టర్ సమావేశానికి హాజరయ్యేందుకు దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవిటి శేఖర్ హైదరాబాద్ నుంచి బొమ్మరాస్‌పేట వెళ్తుండగా రోటిబండ తండా గిరిజన రైతులు ఆయనను అడ్డుకొని ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయకుండా సీఎంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన రైతులు శేఖర్‌పై దాడికి దిగారు. తండాలోని గ్రామ పంచాయతీ భవనంలో ఆయనను నిర్బంధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. రైతులను శాంతింపజేసే ప్రయ త్నం చేశారు.

ఆందోళన విరమించాలని, శేఖర్‌ను వదిలేయాలని బొమ్మారాస్ పేట ఎస్సై అబ్దుల్ రాహూఫ్ రెండు చేతులు జోడించి రైతులను వేడుకున్నారు. పోలీసుల జోక్యం తో రైతులు శేఖర్‌ను వదిలేశారు. రైతుల ఆందోళనతో సమావేశం వాయిదా పడింది. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటుచేసుకోకుండా పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సీఐ శ్రీధర్‌రెడ్డి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.