- కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
- కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకానికి షరతులు విధిస్తూ అన్నదాతను మరోసారి మోసగించేందుకు కుట్రలు చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడంపై మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని యాచించాలా అని నిలదీశారు.
ఎటువంటి నిబంధనలను విధించకుండా భేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో బోధన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతుభరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని అన్నారు.
ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని గుర్తుచేస్తూ ..ఇంకా ఎన్ని దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారా అని నిలదీశారు. కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని, కాంగ్రెస్ నాయకులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నారని మండిపడ్డారు.