calender_icon.png 26 October, 2024 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్తు అవసరం లేదా?

29-07-2024 02:42:57 AM

2400 ఎన్టీపీసీ విద్యుత్తుపై తెలంగాణ మౌనం

నాలుగు లేఖలు రాసినా స్పందించని విద్యుత్తు శాఖ

విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ ప్లాంటు నిర్మాణం

అవసరం లేకపోతే వేరే రాష్ట్రాలకు కరెంటు: ఎన్టీపీసీ

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణకు విద్యుత్తు అక్కర లేదా? అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. ఏటికేడు రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్నా.. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభించడం కష్టంగా ఉంది. పైగా అత్యధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే విద్యుత్తు లభించే అవకాశం ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం (విద్యుత్తు శాఖ) నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. తెలంగాణకు విద్యుత్తు అవసరం లేదా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఎందుకంటే ఎన్టీపీసీ నుంచి ఎన్ని లేఖలు రాసినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు మరి. 

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం..

తెలంగాణలో విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను నిర్మించి అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 100 శాతం తెలంగాణకే కేటాయించాలని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు. దీనిని అమలు చేయడంలో చాలా ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు మొదటి ఫేజ్‌లో భాగంగా రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్ల (మొత్తం 1600 మెగావాట్లు) నిర్మాణాన్ని కొద్ది నెలల క్రితం పూర్తిచేసిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ఆ విద్యుత్తును తెలంగాణ అవసరాలకు అందిస్తోంది. మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్లను కూడా రామగుండంలోనే నిర్మించేందుకు ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును (100 శాతం) తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రం (విద్యుత్తు శాఖ) ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. 

మౌనమెందుకు?

కొద్ది కాలం క్రితం 1600 మెగావాట్ల థర్మల్ విద్యుతు ప్లాంట్లను నిర్మించి తెలంగాణతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్తును అందిస్తున్న ఎన్టీపీసీ.. మిగిలిన 2400 మెగావాట్ల థర్మల్ విద్యుతు ప్లాంట్ల విషయంలో ఒప్పందం చేసుకోవడానికి పలుమార్లు తెలంగాణ విద్యుత్తు శాఖకు లేఖలు రాసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో రాష్ట్రానికి కరెంటు అవసరం లేకపోతే వేరే రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని ఎన్టీపీసీ మరోసారి కోరింది. అయినా తెలంగాణ నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. 9.1.2024న ఎన్టీపీసీ కమర్షియల్ జీఎం శంకర్ శరన్ నుంచి తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ జేఎండీకి లేఖ వచ్చింది.

స్టేజ్ మిగతా 2400 మెగావాట్ల విద్యుత్తు విషయంలో విద్యుత్తు ఒప్పందం కోసం ఇప్పటికే లేఖలు రాశామని అందులో పేర్కొన్నారు. థర్మల్ ప్లాంట్ల కోసం పెట్టుబడులు కేటాయించేందుకు వీలుగా ముందుగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఒకవేళ తెలంగాణకు విద్యుత్తు అవసరం లేకపోతే.. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొంటామని తెలిపారు. కానీ తెలంగాణ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో 29.1.2024న కమర్షియల్ జీఎం మరో లేఖ కూడా రాశారు.

అందులోనూ ఇదే విషయాన్ని తెలిపారు. దీనికి కూడా స్పందన లేకపోవడంతో.. 29.4.2024న ఎన్టీపీసీ ఈడీ (కమర్షియల్) అజయ్‌దువా తెలంగాణ విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌ఏఎం రిజ్వీకి లేఖ రాశారు. ఇందులోనూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టంగా తెలిపారు. వాస్తవానికి 10.2.2024 నాటికి స్పందించకుంటే.. తెలంగాణకు కరెంటు అవసరం లేదనే అనుకోవాల్సి వస్తుందని, దీనితో ఇతర రాష్ట్రాలతో ఒప్పందానికి ముందుకు వెళతామని కూడా ఆయన తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.