calender_icon.png 7 November, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రాతో హైరానా వద్దు

07-11-2024 01:15:13 AM

  1. అది ఎలాంటి అనుమతులు ఇవ్వదు
  2. బస్సులను కొని మహిళలకు లీజుకు ఇస్తాం
  3. ఎస్‌హెచ్‌జీలకు 20వేల కోట్ల రుణాలు  
  4. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి
  5. రుణ నిబంధనలు సరళతరం చేయండి
  6. భారీగా ఉపాధి కల్పించేందుకు ఇండస్ట్రియల్ పార్కులు 
  7. బ్యాంకర్లతో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): హైడ్రాతో హైరానా పడాల్సిన అవ సరం లేదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. తమది ప్రజా ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

ఆర్థిక శాఖ స్పెషల్  సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో బుధవారం  ప్రజా భవన్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొని మాట్లాడుతూ భవన నిర్మాణాలకు హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు.

జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయని వివరించారు. సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కులు, సరస్సులను ఆక్రమించుకోకుండా మాత్రమే హైడ్రా చూస్తుందని భట్టి వెల్లడించారు.

98శాతానికి పైగా రుణాల రికవరీ.. 

మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇచ్చే ఆలోచనను సైతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు రూ. 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని తమ క్యాబినెట్ నిర్ణయించిందని గుర్తు చేశారు. వీలైతే ఇంకా ఎక్కువ మొత్తంలో వడ్డీలేకుండా ఇస్తామని పేర్కొన్నారు.

కమర్షియల్ బ్యాంకులు ఎక్కువగా వడ్డీలను వసూ లు చేస్తున్నాయని చెప్పారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలని, రుణా లు ఇచ్చే ముందు నిబంధనలు సరళతరం చేయాలని భట్టి కోరారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం 98 శాతానికి పైగా ఉందని, అందుకే మహిళలకు తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్థిక చేయూత కోసమే ఉచిత బస్సు..

ఇదిలా ఉండగా మహిళలు ఊరికే తిరగడానికి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం లేదని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మహిళలు గౌరవం మర్యాదలతో జీవించేందుకు మహాలక్ష్మి పథకం దోహద పడుతుందన్నారు. మహిళలు బయటకు వచ్చి కుటుంబాలకు ఆర్థికంగా చేయూ తను ఇవ్వాలనేదే ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశమన్నారు.

దీని ద్వారా కుటుంబం మరింత బలోపేతం అవుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు 12 వేల కోట్ల పైగా టర్నోవర్ చేస్తున్నారని భట్టి చెప్పారు. ఇదే సమయంలో గిరిజన ప్రాంతాల్లోని సంఘాలు సుమారు 200 కోట్ల వరకు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని గుర్తు చేశారు.

ఆ రుణాలను మాఫీ చేయడం లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. హైదరాబాదులో రూ. 3000 కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరిం చారు. వాటిని రూ.5వేల కోట్లకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. 

ఎంఎస్‌ఎంఈలకు సహకరించాలి

భారీగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలతో పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొస్తున్నామని, వాటికి బ్యాంకర్లు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసే పార్కుల్లో మహిళలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయన్నారు. బ్యాంకర్లు సహక రిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వివరిం చారు.

బ్యాంకర్ల సమావేశంలో సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామ కృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.