నిజామాబాద్ జిల్లా మెంట్రాజ్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- చివరి ధాన్యం గింజనూ కొంటాం
- మంత్రి జూపల్లి కృష్ణారావు
- నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన
కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చిన రైతు కూడా రూపాయి నష్టపోవద్దని నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి, ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా మెంట్రారాజ్‌పల్లి, ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రభుత్వ ఆస్తులను అమ్మిందని విమర్శించారు. గత ప్రభు త్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభు త్వం చేయద్దనే ఉద్దేశంతోనే ఆలస్యమైనా ఇచ్చిన హమీలను నేరవేరుస్తున్నామని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.
కొను గోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తేమశాతం చూసి కాంటా పెట్టాలని సూచిం చారు. కాంటా కాగానే సేకరించిన ధాన్యానికి సంబంధించిన రసీదును రైతులకు ఇవ్వాలని సూచించారు. రైతులకు చెల్లించాల్సిన డబ్బుల వివరాలతో పాటు బోనస్ వివరాలు కూడా ఉంటాయని తెలిపారు. మిల్లర్ వద్ద రైతులు పడిగాపులు కాయల్సిన అవసరం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మంత్రి వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హుందాన్, నుడా చైర్మన్ కేశవేణు, డీసీసీ అధ్యక్షుడు కార్పొరేషన్ చైర్మన్ మాను ల మోహన్‌రెడ్డి,
విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ గడుగు గంగాధర్, శరత్, రత్నాకర్, బంటు బలరాం, ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌రెడ్డి, ఆర్మూర్ మున్సి పల్ చైర్‌పర్సన్ లావణ్యశ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, లింగాగౌడ్, శివలింగు శ్రీనివాస్ ఉన్నారు.
మంత్రి పర్యటనలో ఫ్లెక్సీ వివాదం
ఆర్మూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో ఫ్లెక్సీ వివా దం తలెత్తింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ అర్వింద్, స్థానిక ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఫొటోలు లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిని ఒకరు తోపులాడుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు.