- భార్యాభర్తలను ఒక్కటి చేయండి..
- హైకోర్టు తాత్కాలిక సీజే సుజయ్‌పాల్
- కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లకు పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ‘చిన్న చిన్న వివాదాలకు భార్యాభర్తలు విడిపోతున్నారు. మధ్యవర్తిత్వంతో వారిని ఒక్కటి చేయండి. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా చూడండి’ అంటూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సుజయ్‌పాల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లకు నిర్వహిస్తున్న మూడురోజుల శిక్షణ మంగళవారంతో ముగిసింది. ముగిం పు కార్యక్రమానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.
మధ్యవర్తిత్వంతో కుటుం బ వ్యవస్థను నిలబెట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమ స్యలను సున్నితంగా పరిష్కరించాలని సూచించారు. మహాత్మా గాంధీ సైతం దక్షిణాఫ్రికాలో మధ్యవర్తిత్వం వహించి వర్తకుల మధ్య వందలాది వివాదాలను పరిష్కరించారని గుర్తించారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే లక్ష్యం కావాలన్నారు.
తెలంగాణ మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ప్రెసిడెంట్ జస్టిస్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘దేశ జనాభా 143 కోట్లకు చేరింది, అంత జనాభాకు దేశవ్యాప్తంగా కోర్టులు చాలడం లేదు. ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం సాధ్యపడదు. అలా కావాలని కోరుకోవడమూ సమజసం కాదు.
అసలు కోర్టు వరకు ప్రజలు రాకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది మధ్యవర్తిత్వం. ఎన్నో కేసులను మధ్వవర్తిత్వంతోనే పరిష్కరించవచ్చు. కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లకు ఇప్పుడా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి’ అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీజీ ఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి, ఏవో కళార్చన, డీఏవో ఇందిర తదితరులు పాల్గొన్నారు.