మొండిగా వ్యవహరిస్తే ప్రభుత్వాన్నే నిమజ్జనం చేస్తాం
భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు
నిమజ్జన ఆంక్షలు విధిస్తూ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బారికేడ్లు తొలగింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): హిందువుల ఉత్సవాలు, విశ్వాసాల జోలికొస్తే వినాయక విగ్రహాలతో భాగ్యనగర్ మొత్తాన్ని స్తంభింపజేస్తామని, మొండిగా వ్యవహరిస్తే ప్రభుత్వాన్ని కూడా నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వినాయక సాగర్ (ట్యాంక్‌బండ్) లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం తమ ధార్మిక హక్కు అని సమితి నాయకులు అన్నారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనంపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై జీహెచ్‌ఎంసీ, పోలీసులు ఏర్పాటు చేసిన ‘నో ఐడల్ ఇమ్మర్షన్ ఎట్ ట్యాంక్‌బండ్’ ఫ్లెక్సీలను, బారికేడ్లను ఆదివారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు తొలగించారు. తొలగించిన బారికేడ్ల వద్ద నుంచి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రి క్తత వాతావరణం చోటుచేసుకుంది.
అనంతరం భాగ్యనగర్ గణేశ్ ఉత్స వ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు నిమజ్జనం చేయొద్దని చెప్పిందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందువుల ఉత్సవాలు, విశ్వాసాలు అంటేనే కోర్టు తీర్పులు అంటున్నారని, ఈ ప్రభుత్వం దారుసలాం, రజాకార్ ఎజెండాను అమలు చేసేందుకు సిద్ధమైందని ధ్వజమెత్తారు. సౌండ్ పొల్యూషన్‌ను అరికట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ మక్కా మసీదుపై లౌడ్ స్పీకర్లు ఉన్నా ఎందుకు తొలగించడం లేదన్నారు. భక్తుల విశ్వాసాలపై నిషేధం పెట్టేందుకు ఏంహక్కు ఉందని ప్రభుత్వాన్ని నిలదీశారు.