calender_icon.png 7 November, 2024 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్ను ఎగవేతదారులను ఉపేక్షించొద్దు

07-11-2024 02:10:10 AM

నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను సాధించాలి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, నవంబర్ 6(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పన్ను ఎగవేతదారులను ఉపేక్షించేది లేదని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం ప్రజాభవన్‌లో రెవెన్యూ మొబిలైజేషన్‌పై కమర్షియల్ టాక్స్, ట్రాన్స్‌పోర్టు, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, టీజీఎండీసీ, ఎక్సుజ్, తదితర ఆదాయం తెచ్చే శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

శాఖల వారీగా సాధించిన పురో గతి వివరాలు, భవిష్యత్ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూ టీ సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వనరుల సమీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సిమెంట్, స్టీల్, స్క్రాప్ ట్రేడర్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్స్‌ను రాష్ర్ట రహదారులపై కూడా ఏర్పాటు చేయడం వల్ల లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచుకోవచ్చని అధికారులకు సూచించారు.

రాష్ర్టంలోని ఐరన్ మైనింగ్స్‌ను టీజీఎండీసీకి రిజర్వ్ చేయాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనల పురోగతిపై ఆరా తీశారు. ప్రతి మండల కేంద్రంలో ఇసుక మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసి సమృద్ధిగా అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర, ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు, కలుపుకొని దళారుల బెడద లేకుండా నేరుగా ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఇసుకను సరఫరా చేసేలా చూడాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు ఆర్థికంగా మేలు జరుగుతుందన్నారు.

సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ, వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, భూగర్భ గనుల శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, ఎక్సుజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.