ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో నడుం నొప్పి ఒకటి. నొప్పిని భరించలేనివారు పెయిన్ కిల్లర్లపై అధారపడుతుంటారు. మరికొంత మంది సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు నడుము నొప్పికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
నడుంనొప్పికి కారణాన్ని గుర్తించటం, దాన్ని సరిచేసుకోవటం అన్నింటికన్నా ముఖ్యం. ఉదాహరణకు శారీరక శ్రమ లేకపోవటం వల్ల నొప్పి వస్తుంటే వ్యాయామం, నడక వంటివి ఆరంభించాలి. అధిక పని వల్ల వస్తుంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
బరువులు ఎత్తేటప్పుడు నడుమునే కాకుండా మోకాళ్లు కూడా వంచుతూ బరువు ఎత్తి, తర్వాత పైకి లేవాలి. ఎక్కువసేపు కూచోకుండా, నిలబడకుండా చూసుకోవాలి. అరగంట కన్నా ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే కనీసం పది సెకండ్ల పాటైనా కూర్చోవటానికి ప్రయత్నించాలి.
చికిత్స..
నడుంనొప్పికి డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెబుతుంటారు. కానీ ప్రస్తుతం ఎక్కువకాలం విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. దీంతో చాలామంది సొంతంగా నొప్పి నివారణ మాత్రలు వేసుకోవటం మొదలెడతారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. డాక్టరు సలహా లేకుండా ఎలాంటి మాత్రలైనా వేసుకోవటం తగదు. వెన్నునొప్పికి ఫిజియోథెరపీ కూడా మేలు చేస్తుంది.
అలాగే యోగాసనాలతో చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది. పక్కకు వంగటం, కొద్దిగా ముందుకు వంగటం, వెనక్కు వంగటం చాలా మేలు చేస్తాయి. దీనికి సంబంధించిన యోగాసనాలను 4-6 వారాల వరకు క్రమం తప్పకుండా వేయాలి. అప్పుడే మంచి ఫలితం కనబడుతుంది. నొప్పి తగ్గిన తర్వాత కూడా ఈ యోగాసనాలను మరికొంత కాలం కొనసాగించాలి.
దీంతో సమస్య తిరగబెట్టకుండా ఉంటుంది. యోగా చేయడం వల్ల ఆయా భాగాల్లో ఒత్తిడి పడుతుంది. దీంతో నాడులు, కండరాలు, కీళ్లు ఉత్తేజితమై నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భిణులు, హెర్నియా, అల్సర్ సమస్యలున్నవారు, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు నిపుణుల సలహాల మేరకు చేయాల్సి ఉంటుంది.
చెక్ పెట్టేద్దాం ఇలా
ఒత్తిడి తగ్గించుకుందాం: బాగా నడుము నొప్పిగా ఉన్నవారు తగ్గించుకోవాలంటే ముందు ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వెన్నెముక కండరాలు బలోపేతం చేయడంతోపాటు, కొన్ని రోజువారీ అలవాట్లను మార్చుకోవడం వల్ల నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది.
వ్యాయామం: నడుంనొప్పిని తగ్గించుకోవడంలో వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక వ్యాయామం చేసే సమయంలో నడుముకు సంబంధించిన ముఖ్యమైన కండరాలపై దృష్టిసారించి సరైన శిక్షణతో వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కండరాలను సాగదీసే స్ట్రెచ్ ఎక్సర్‌సైజులు చేయడంవల్ల ఫలితం ఉంటుంది. వెన్ను సంబంధిత గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. నడుం నొప్పి తగ్గడం కోసం వారానికి కనీసం రెండుసార్లు నడుమును బలపరిచే వ్యాయామాలను చేయండి.
కాల్షియం, విటమిన్ డి: ఎముకలు బలంగా ఉన్నప్పుడు నడుము నొప్పి వంటి సమస్యలు ఎక్కువ బాధించవు. బలహీనమైన ఎముకలు ఉన్నప్పుడు కచ్చితంగా నడుంనొప్పి ఇబ్బంది పెడుతుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవడం ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది. అందుకే తప్పనిసరిగా కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం మర్చిపోకండి. పాలు, పెరుగు, ఆకుకూరలు, విటమిన్ సప్లిమెంట్లు వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది.
సరైన పొజిషన్: ఆఫీసులో కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు సరైన భంగిమ పద్ధతులను పాటించండి. మనం కూర్చునే విధానం బట్టి కూడా నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే కూర్చున్నా, నిల్చున్నా కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి గంటల తరబడి కంప్యూటర్ ముందు పని చేసేవారు మంచి కుర్చీని ఎంపిక చేసుకొని కూర్చోవాలి. లేదంటే నడుం నొప్పి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది.