మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గురుపూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గురువారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ విద్యాశాఖ పట్ల మీ చిత్తశుద్ధికి, ప్రాధాన్యతకు ఇది మరో నిదర్శనమని విమర్శించారు. 9 నెలల మీ పాలనలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని, టీచర్లు లేక పాఠశాలలు మూసేస్తున్నారని పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లతో రోదిస్తున్నారని, గురుకులాల ఖ్యాతిని రోజు రోజుకు దిగజార్చుతున్నారని విమర్శించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యా యులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని, తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం దురదృష్టకరమన్నారు. తమ పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా రని, ఉన్న విద్యా వ్యవస్థను సక్రమంగా నిర్వహించరు కానీ సమీ కృత గురుకులాలు, విద్యా కమిషన్ అంటూ భ్రమలు కల్పిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ నాయకత్వంలో పతనమవుతున్న విద్యా వ్యవస్థ గురించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.