calender_icon.png 24 September, 2024 | 10:02 PM

వివేకా హత్య కేసులో సునీల్‌కు బెయిల్ ఇవ్వొద్దు

24-09-2024 12:26:21 AM

హైకోర్టులో సీబీఐ వాదనలు

తీర్పు వాయిదా వేసిన న్యాయమూర్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేయరాదని తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదించారు. విచారణలో జాప్యం జరుగుతుందన్న కారణంగా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది. ఆర్థిక నేరాల విచారణలో జాప్యం జరిగినపుడు బెయిలు మంజూరు చేయవచ్చని, క్రిమినల్ కేసులో విచారణ జాప్యం పేరుతో బెయిల్ మంజూరుకు వీల్లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేసింది.

వివేకా హత్య కేసులో ఏ2 యాదాటి సునీల్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం విచారించారు. ఇదే కేసులో పలువురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, పిటిషనర్‌కూ బెయిల్ ఇవ్వాలని న్యాయవాది నయన కుమార్ వాదించారు. గతంలోనే బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసిందని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేనందున బెయిల్ ఇవ్వరాదని సిబీఐ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.