ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్, జనవరి22: ప్రజల సొమ్ము దోచుకోనేందుకు రోజుకి కొత్త కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకోనేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారని, మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ బుధవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలకు సూచించారు.
సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్లు మల్టీలెవెల్ మార్కెటింగ్ పై దృష్టి సారించి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి మోసగించి ఆర్థిక నష్టాన్ని కలగజేస్తారన్నారు .
మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను చాలామంది విదేశాల్లో ఉండి ఒక రాకెట్ లా నడుపుతారు భారీ లాభాలు తోపాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వలపన్ను తారని ఎస్పీ తెలిపారు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, వాట్సప్ నెంబర్ 8712672222 ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.