calender_icon.png 30 September, 2024 | 10:52 PM

డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు

26-09-2024 04:15:47 AM

రాష్ట్రం మరో పంజాబ్‌లా కావద్దు 

  1. ఉపాధి లేకనే యువత చెడు వ్యసనాల బాట 
  2. బీటెక్ కాలేజీల్లో వసతుల్లేకుంటే గుర్తింపు రద్దు
  3. ప్రతిభ ఉన్నా నైపుణ్యం లేకుంటే ఉద్యోగాలు రావు 
  4. రెండు మూడు నెలల్లో 35 వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం
  5. బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కకపోవడంతో యువత చెడు వ్యసనాల బారిన పడుతున్నారని.. డ్రగ్స్, గంజాయి వాడకంలో తెలంగాణ మరో పంజాబ్‌లా కాకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ఇటీవల డ్రగ్స్, గంజాయి కేసుల్లో పట్టుబడినవారిలో ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించిందని చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని.. ఇలాంటి పరిస్థితి నుంచి యువతను బయటపడేయాలంటే వారికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

బీటెక్ విద్యార్థులకు చిన్నచిన్న అంశాలపైనా అవగాహన ఉండటంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో మంచి ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేకుంటే రానున్న రోజుల్లో ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. విద్యార్థులకు కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని, నైపుణ్యం కూడా ఉండాలని సూచిం చారు.

త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. బుధవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో 38 కాలేజీల్లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిగ్రీ పట్టా ఉంటే సరిపోదని, ఉద్యోగానికి కావాల్సిన స్కిల్ కూడా ఉండాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి కోసం బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సును అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టంచేశారు.

డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో 35 వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

డగ్స్ అమ్మేవారిలో బీటెక్ విద్యార్థులు 

రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు యాంటి నార్కొటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. గంజాయి సేవించే వారే కాదు, అమ్మేవాళ్లు కూడా బీటెక్, డిగ్రీ చదివిన విద్యార్థులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పంజాబ్ నిర్లక్ష్యం వల్ల అక్కడి యువత వ్యసనాలకు బానిసలై దారుణ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. అలాంటి పరిస్థితి మన దగ్గర రాకుండా సమాజం మొత్తం అప్రమత్తం కావాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, అమ్ముతున్నా సమాచారం అందించాలని కోరారు. 

ఎడ్యుకేషన్ హబ్‌గా హైదరాబాద్ 

ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని సీఎం స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చటంతో పాటు నైపుణ్యాల అభివృద్ధి చిరునామాగా తీర్చిదిద్దుతామని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను తయారు చేసి.. ఉపాధికి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

ఇందులో భాగంగానే బీఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు ఇచ్చిన ప్రతిపాదనలతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలకు ఢోకా ఉండదని అన్నారు.

అవసరమైన రూ.25 కోట్ల నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎక్విప్ సంస్థను, ఈ కోర్సు సిలబస్ను రూపొందించిన బీఎఫ్‌ఎస్‌ఐ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 

పాలిటెక్నిక్ కాలేజీను అప్‌గ్రేడ్ చేస్తాం 

ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం నెలకొల్పిందని, మహీం ద్రా గ్రూప్ చైైర్మన్ ఆనంద్ మహీంద్రాను బోర్డు చైర్మన్‌గా నియమించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. దీంతో ఏటా వేలాది మంది యువతకు వివిధ రంగాల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు.

అలాగే పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ , స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు. 

డిసెంబర్‌లో సీఈవోలతో సమావేశం 

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారని, అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని సీఎం చెప్పారు. రాష్ట్రానికి ఆహ్వానించి డిసెంబర్‌లో వారితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి నైపుణ్యాన్ని వినియోగించుకుంటామని తెలిపారు.

విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఫించన్లు లాంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదని సీఎం అన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంచి, వ్యాపారవేత్తలుగా, ఉన్నత స్థానాల్లో నిలబెట్టేలా తీర్చిదిద్దాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎక్విప్ సంస్థ రూ.2.5 కోట్ల చెక్కును ముఖ్యమంత్రికి అందించింది. విద్యార్థుల డేటాతో రూపొందించిన ఎక్విప్ స్కిల్ పోర్టల్ ను ముఖ్యమంత్రి ఈ వేదికపై ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, బీఎఫ్‌ఎస్‌ఐ కన్సార్టి యం ప్రతినిధులు మమతా మాదిరెడ్డి, రమే శ్ ఖాజా, ఎక్విప్ సంస్థ ప్రతినిధులు హేమంత్‌గుప్తా, జీ సాయికిరణ్ పాల్గొన్నారు.