calender_icon.png 23 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పీచ్‌లు ఇవ్వొద్దు

23-01-2025 01:50:09 AM

  1. కమిషన్‌కు మీ సపోర్ట్ అవసరం లేదు
  2. ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. నీటిపారుదల నిపుణులు
  3. వీ ప్రకాశ్‌కు కాళేశ్వరం కమిషన్ చురకలు

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : ‘పొలిటికల్ స్పీచ్ వద్దు.. మేం అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీరు సమర్పించిన డాక్యుమెంట్స్‌పై మాత్రమే మాట్లాడండి. కమిషన్‌కు మీ సపోర్ట్ అవసరం లేదు.. మా వద్ద అందుబాటులో ఉన్న రికార్డులు, డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ కొనసాగి స్తాం అని’ కాళేశ్వరం కమిషన్ స్పష్టం చేసింది.

బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు సాగునీటి రంగ నిపుణుడు వీ ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భం గా కమిషన్ ఆయనను పలు అంశాలపై ప్రశ్నించింది. కమిషన్‌కు సపోర్ట్ చేసేందుకు వచ్చినట్లుగా ప్రకాశ్ పేర్కొనగా.. మీ సపోర్ట్ మాకు అక్కరలేదని కమిషన్ ఖరాకండిగా చెప్పింది. తమ వద్ద తగిన సమాచారం ఉందని స్పష్టం చేసింది.

తెలంగాణ ఉద్యమం సాగిందే నీటి కోసం అంటూ ప్రకాష్ మాట్లాడే ప్రయ త్నం చేయగా.. పొలిటికల్ స్పీచ్ వద్దని, విషయం మాత్రమే చెప్పాలని ఆదేశించింది. తుమ్మడిహట్టి నుంచి కాళేశ్వరం కోసం సైట్ మార్చాల్సిన అవసరం ఏం టని కమిషన్ ప్రశ్నించగా.. తెలంగాణకు కాళేశ్వరమే ఆధారమని, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేనందుకే మార్చినట్లు తెలిపారు.

తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉందన్నారు. ఇందులోనూ 63 టీఎంసీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వాటా అని, ఇందులోనూ 44 టీఎంసీలను మాత్రమే లిఫ్టు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. అలాగే తుమ్మిడిహట్టిని 148 మీటర్లకు కుదించుకోమని మహారాష్ట్ర కోరిందన్నా రు.

ముంపు బాధితులు కూడా తుమ్మిడిహట్టికి అంగీకరించలేదని తెలిపారు. ముందు అనుకున్నట్లుగా 152 మీటర్ల బ్యారేజీ సాధ్యం కాదని భావించినందునే కేసీఆర్.. 2 కి.మీ ఎగువన 200 టీఎంసీల నీటి లభ్యత ఉన్న ప్రాంతానికి ప్రాజెక్టును మార్చి నిర్మించినట్లు వెల్లడించారు.

సీడబ్ల్యూసీ విజ్ఞప్తి మేరకు ప్రత్యామ్నాయంగా లైడార్ సర్వే ద్వా రా వ్యాప్కోస్ రిపోర్ట్ ఆధారంగా 3 బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపా రు. వార్ధా, వెన్‌గంగా వీ ఆకారంలో కలుస్తాయని అందుకే అక్కడ బ్యారేజీ నిర్మాణం చా లా జఠిలమైన సమస్యగా మారుతుందని భావించినట్లు వెల్లడించారు. 

తుమ్మిడిహట్టి వద్దే నిర్మించాలని నిపుణుల కమిటీ చెప్పింది కదా..

నిపుణుల కమిటీ మాత్రం తుమ్మడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నట్లుగా తెలిపిన విషయంపై కమిషన్ ప్రశ్నించగా.. అదే నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా సరైనదే అని చెప్పిందని వీ ప్రకాష్ తెలిపారు. నిపుణులు ఇచ్చిన నివేదిక రికార్డుల ప్రకారం ఉందని.. అందుకే రికార్డుల్లోని అంశాలు మాత్రమే చెప్పాలని కమిషన్ స్పష్టం చేసింది.

గోదావరిపై ఆధారపడిన ప్రాజెక్టులన్నీ స్థిరీకరణ జరగాలని రాష్ట్రంలోని ప్రజలు కోరుకున్నట్లుగా ప్రకాష్ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలో అనధికారికంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలను వందలాదిగా నిర్మించారని ఫలితంగా భవిష్యత్తులో నీటి లభ్యత కష్టమైపోయిందన్నారు. అందుకే నీటి లభ్యత కోసమే లొకేషన్‌ను మార్చినట్లు వెల్లడించారు.

తుమ్మిడిహట్టిని మార్చడం వల్లే నీటి లభ్యత పెరిగిందన్నారు. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. దాన్ని మరమ్మతులు చేసి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావచ్చని ప్రకాష్ చెప్పారు. మీరు ఇంజనీరింగ్ నిపుణులు కాదని, కాబట్టి మీరు చెప్పే టెక్నికల్ అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకోబోదని స్పష్టం చేసింది. 

ఆ ముగ్గురు కమిషన్ దృష్టి మళ్లించారు..

కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. తన నుంచి 101వ సాక్షిగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని తెలిపారు. తాను ఇచ్చిన 16 పేజీల అఫిడవిట్ ఆధారంగా వివరణ తీసుకున్నారని అన్నారు. 17 అంశాలను తాను అఫిడవిట్‌లో నమోదు చేసినట్లు తెలిపారు.

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, అయినా అక్కడే ప్రాజెక్టు నిర్మిస్తే నీళ్లు సరిపోక రైతులు ఆత్మహత్య చేసుకుంటారని భావించే, కేసీఆర్ ప్రాజెక్టును అక్కడి నుంచి మార్చినట్లు వివరించారు. సీడబ్ల్యూసీ కోరినట్లుగా ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు.

సాగునీటి నిపుణుడు వెదిరె శ్రీరాం, విద్యుత్ రంగ నిపుణుడు రఘు, ఎమ్మెల్సీ కోదండరాం కమిషన్‌ను దృష్టిమళ్లించారని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్ల నుంచి కూడా అబద్ధాలు చెప్పించాలని చూశారని ఆయన విమర్శించారు.

అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడి సభను తప్పుదారి పట్టించారని, అందుకే ఆయనపై వాయిదా తీర్మానం ఇవ్వాలని తాను ప్రతిపక్షానికి సూచించినట్లుగా ప్రకాష్ వెల్లడించారు.

కుంగుబాటుపై ఎన్డీఎస్‌ఏనే ఇంతవరకు ఏమీ చెప్పలేకపోయిందని అన్నారు. అయితే మేడిగడ్డ కుంగుబాటు.. వరద ఎక్కువగా రావడం వల్ల జరిగిన ఓ ప్రమాదం మాత్రమేనని అన్నారు.