అప్రమత్తతే ఆయుధం.. జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడి
కామారెడ్డి (విజయక్రాంతి): మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ(District SP Sindhu Sharma) జిల్లా ప్రజలకు మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు, హెర్బల్, హెల్త్ కేర్, ఇతర గృహాపకరణాల మార్కెటింగ్ పేరుతో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని మళ్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ (పిరమిడ్ మోసాలు) మళ్ళీ ప్రారంభమయ్యాయని అన్నారు. గొలుసుకట్టుగా అమాయకులను వల వేసి మోసం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ విధమైన మోసాలకు కొంతమంది వ్యక్తులు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల కామారెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు.
విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని, రకరకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి, ప్రజల నుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్ లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారు. ఇలాంటి స్కీం లలో తొలుత చేరిన తక్కువ మందికి లాభాలు చూపించి, మిగిలిన అందరి సొమ్ము కొల్లగొడతారని తెలిపారు. ఇలాంటి నూతన స్కీం ల పట్ల, నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. మనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చెయ్యరనే విషయాన్ని గ్రహించాలని తెలిపారు.
కాబట్టి ఇలాంటి నేరాల పట్ల మొబైల్ ఫోన్లను చూసే మనకు Facebook, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ-మెయిల్, ఫోన్ కాల్ ల ద్వారా మీ దృష్టిని ఆకర్షించే ఇటువంటి కుట్రలకు ఎట్టిపరిస్థితుల్లో లొంగవద్దని, తొందరపడి బాధలను, నష్టాలను కొని తెచ్చుకోవద్దన్నారు. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కూడా మోసపోయిన పక్షంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్ కి గానీ, www.cybercrime.gov.in ద్వారా కానీ లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ లో నైనా వెంటనే పూర్తి వివరాలతో ఫిర్యాదు చెయ్యాలని సూచించారు. సైబర్ మోసాల బారిన పడిన బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేయగలిగితే అంత త్వరగా వారు కోల్పోయిన నగదును తిరిగి పొందవచ్చని తెలిపారు.