తప్పు జరిగితే ఒప్పుకోండి
ప్రాయశ్చిత్త దీక్ష మూడో రోజు పవన్ వ్యాఖ్యలు
ఇంద్రకీలాద్రి మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం
విజయవాడ, సెప్టెంబర్ 24: వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పులు జరుగుతున్నా యని ఆరోపిస్తే అపహాస్యం చేసేవారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు ఎగతాళి చేశారని చెప్పారు. సనాతన ధర్మం జోలికి రావొద్దని, అపవిత్రం జరిగినప్పుడు బాధ్యతలో ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను ఏపీ మాజీ సీఎం జగన్‌ను ఎత్తి చూప డం లేదని, వాళ్ల హయాంలో జరిగిన అపచారంపై స్పందించాలని కోరుతున్నట్లు వెల్ల డించారు. తిరుమల లడ్డూలో కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ మెట్లను శుభ్రం చేశారు.
పొగరుగా మాట్లాడితే సహించం
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ.. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. సున్నితమైన అంశాల్లో వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్య లు బాధాకరం. ఇలాంటి అంశాల్లో పొగరు గా మాట్లాడితే అసలు సహించం. సనాతన ధర్మం జోలికి రావొద్దని విమర్శించేవారిని హెచ్చరిస్తున్నా.
తప్పు జరిగితే ఒప్పుకోండి, లేదంటే సంబంధం లేదని చెప్పండి అని పవన్ అన్నారు. తిరుమలను ఇష్టారాజ్యంగా మార్చిన మాజీ ఈవో ధర్మారెడ్డి కనిపించ డం లేదని, విచారణకు రావాలంటే సుబ్బారెడ్డికి రికార్డులు ఇవ్వాలని అడుగుతున్నారని పవన్ అన్నారు. సనాతనధర్మంపై పోరాటం లో తననెనవరూ ఆపలేరని, భరతభూమి అ న్ని మతాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు.