ఉమ్మడి కుటుంబాలు కనుమరుగుకావడం, న్యూక్లియర్ కుటుంబాలు పెరగడం లాంటి కారణాలతో చాలామంది సీనియర్ సిటిజన్స్‌కు రక్షణ లేకుండా పోతున్నది. దాంతో ఒంటరితనం, నిర్లక్ష్యానికి గురికావడం జరుగుతున్నది. బంధువులు, స్నేహితుల సహాయం తీసుకోవడం తప్ప వేరే మార్గం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో టెక్నాలజీ, ఇతరత్రా విషయాలు ఈతరంవారి జీవనవిధానాన్ని సులభతరం చేస్తున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం కమ్యూనికేట్ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. దూరాలను తగ్గించింది. జూమ్, వాట్సాప్, గూగుల్ మీట్ వంటి యాప్స్ ప్రపంచంలో ఇష్టమైనవారు ఎక్కడున్నా సులభంగా మాట్లాడవచ్చు.
మనవరాళ్లతో కనెక్ట్ అవ్వడం, పుట్టినరోజులు లేదా పండుగలు లాంటి అద్భుతమైన క్షణాలను హాయిగా పంచుకోవచ్చు. కాకపోతే కావాల్సిందల్లా కొంచెం టెక్నాలజీ తెలిసి ఉండటమే. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్స్, ల్యాప్‌టాప్ ఆపరేటింగ్‌తో ప్రపంచంతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. వర్చురల్ రిలేషన్స్ కూడా కుటుంబ బంధాలను బలంగా ఉంచుతున్నాయి.
ఆ పాత మధురం
ప్రస్తుత డిజిటల్ యుగంలో వినోదాన్ని అందించే సాధానాలెన్నో ఉన్నాయి. నిమిషాల్లో నచ్చిన సినిమాలను చూసేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, టీవీ షోలు.. ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఓటీటీలు వెబ్‌సీరిస్‌లు మొదలుకొని అనేక సినిమాలను అందిస్తున్నాయి.
ఓటీటీ పరిజ్ఞానంతో పాతకాలంలో మీకు నచ్చిన క్లాసిక్ సినిమాలను ఇంటిపట్టునే ఉంటూ హాయిగా చూడొచ్చు. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లొచ్చు. నచ్చిన సినిమా చూసినా.. వీడియో గేమ్స్ ఆడినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు.. డిజిటల్ బుక్స్ కూడా ఎంతో స్వాంతన చేకూరుస్తాయి.
నిత్య విద్యార్థిగా..
నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే వ్యక్తులు చాలా చురుగ్గా ఉంటున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. పదును పెట్టే పజిల్స్, సుడోకులు లాంటి ఆటలు ఆడటం, కొత్త విషయాలను నేర్చుకోవటం ద్వారా మెదడు పదును తగ్గకుండా ఉంటుంది. అలాగే కొత్త భాష, సంగీతం, వంటలు ఇలా ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవటం ద్వారా ఏకాగ్రత, మెదడు చురుకుదనం పెరుగుతుంది.
డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక తెలియని విషయాలు నేర్చుకోవడం చాలా ఈజీ అయ్యింది. కొత్త భాష, కళలు, సంగీతం, ఫొటోగ్రఫీ లాంటివి ఇంటిపట్టూనే ఉంటూ నేర్చుకోవచ్చు. జీవితకాల అభ్యాసం మనస్సును చాలా ఉత్సాహంగా ఉంచుతుంది.
మానసిక బలం
వృద్ధాప్యాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాతావరణం, ఆరోగ్య సదుపాయాలు, జన్యుపరమైన సమస్యలు.. ఇలా చాలానే ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్నంత మాత్రాన అనారోగ్యం బారిన పడతామని, మరణం సంభవిస్తుందని భయపడిపోవాల్సిన అవసరం లేదు.
శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, బలహీనతలు, సామర్థ్య తగ్గడం లాంటివి బాధించినా పెద్ద సమస్యలా భావించకూడదు. డిప్రెషన్, ఒంటరితనం, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యుల సాయం తీసుకునేలా ప్రోత్సహించాలి. మానసికంగా చాలా బలంగా ఉండాలి.
గాఢ నిద్ర
మంచి నిద్ర అలవాట్లను పాటించడం వల్ల శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఏడు నుండి తొమ్మిది గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో మేల్కొవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.
ఇవి గుర్తుంచుకోండి
పుస్తకాలు, పత్రికలు, వార్తాపత్రికలు చదవడం.
స్నేహితులు, బంధువులతో తరచుగా మాట్లాడటం.
సానుకూలంగా ఆలోచించడం.
ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండటం.
క్షమించడం నేర్చుకోవడం.
లక్ష్యాలపై దృష్టి పెట్టడం.
శారీరకంగా చురుకుగా ఉండటం.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం.