calender_icon.png 25 January, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేపీహెచ్‌బీలో వేలం వేసిన స్థలాలను ఖరారు చేయొద్దు!

25-01-2025 12:42:37 AM

  1. వేలం ప్రక్రియ మాత్రం కొనసాగించొచ్చు..
  2. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  3. ఈ నెల 30వ తేదీకి తదుపరి వాయిదా

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (కేపీహెచ్‌బీ) పరిధిలోని ఖాళీ స్థలాలకు వేలం నిర్వహించవచ్చని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. వేలం దక్కించుకున్న వారికి స్థలాలను ఖరారు చేయొద్దని షరతు విధించింది.

కేపీహెచ్‌బీ ఫేజ్ 15 కాలనీవాసుల తరఫున శ్రీవెంకట రమణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతలపాటి వెంకటరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం ఉదయం విచారణ చేపట్టారు. ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ టి.సుదర్శన్‌రెడ్డి జోక్యం చేసుకుని.. “పిటిషనర్లు వాదిస్తున్నట్లు బోర్డు పరిధిలో 80 అడుగుల రోడ్డు విస్తరణ చేసే ఏరియాలో వేలం వేయనున్న స్థలాలు లేవు.

అధికారులు చట్ట ప్రకారమే వేలం నిర్వహిస్తున్నారు. అందుకు వారిని ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు ఉన్నాయి. 24వ తేదీ (శుక్రవారం) వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అందుకే మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయవద్దు” అని కోరారు. అడ్వొకేట్ జనరల్ అభ్యర్థన తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ.. కేపీహెచ్‌బీ పరిధిలోని స్థలాలను వేలం వేసేందుకు అనుమతులు జారీ చేశారు. 

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు ఇలా..

మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత.. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం. రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. “కేపీహెచ్‌బీ లేఅవుట్‌లో గ్రీనరీకి నిర్దేశించిన స్థలాలకు 24న (శుక్రవారం) వేలం జరగనున్నది. కోర్టు తక్షణం జోక్యం చేసుకుని వేలం ప్రక్రియపై స్టే విధించాలి.

2011 మార్చి 29న నాటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 6లో పేర్కొన్న నిబంధనలకు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం కేపీహెచ్‌బీ పరిధిలోని ఖాళీ స్థలాలకు వేలం వేయనున్నది. 209 గజాల నుంచి ఆఖరికు 30 గజాల స్థలాన్ని కూడా వేలం వేయాలని చూస్తున్నది. దీనిలో భాగంగానే ఈ నెల 10న నోటిఫికేషన్ వెలువడింది.

బోర్డు పరిధిలో మొత్తం 450 ప్లాట్లు ఉన్నాయి. జీవో| 6 ప్రకారం 100 గజాల స్థలాల కంటే తక్కువ ఉన్న ప్లాట్ల పక్కనే ఉన్న ఖాళీ స్థలాలను సదరు యజమానులే వేలంతో సంబంధం లేకుండా సంబంధిత మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుని, మార్కెట్ ధర మేరకు కొనుగోలు చేయొచ్చు.

2015 మే 28న తుది లే అవుట్ వెలువడింది. దీని ప్రకారం లేఅవుట్‌లో 100 అడుగుల రోడ్డే ఉండాలి. కానీ, 80 అడుగుల వెడల్పు రోడ్డు ఉండగానే అధికారులు వేలానికి పూనుకొంటున్నారు. వేలం తర్వాత తిరిగి 100 అడుగుల రోడ్డు నిర్మాణం సాధ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వం వేలం వేస్తున్న స్థలాలన్నీ 80 అడుగుల రోడ్ల పక్కనే ఉన్నాయి.

ప్రభుత్వం వేలం నిర్వహించనున్న ప్లాట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందు పరచలేదు. ఈ కారణాలను పరిగణలోకి తీసుకుని కోర్టు వేలం ప్రక్రియను నిలిపివేయాలి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి” అని వాదించారు. దీంతో న్యాయమూర్తి ఉదయం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించారు.

అధికారులు వేలం ప్రక్రియ కొనసాగించవచ్చని, కానీ.. వేలం దక్కించుకున్న వారికి స్థలాలను ఖరారు చేసి, వారికి కేటాయించొద్దని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. 

మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించండి: రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు

కేపీహెచ్‌బీ లేఅవుట్ 54.29 ఎకరాల్లో పరిధిలో ఉందని, నిబంధనల ప్రకారం ఆ స్థలంలో పది శాతం భూమిని గ్రీనరీకి వదిలేయాల్సి ఉందని, మరి గ్రీనరీకి పది శాతం స్థలం వదిలారా? అని న్యాయమూర్తి పిటిషనర్‌ను ప్రశ్నించారు. తదుపరి విచారణ నాటికి రాష్ట్రప్రభుత్వం కేపీహెచ్‌బీ మాస్టర్ ప్లాన్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించారు.