calender_icon.png 16 April, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడుగు తడబడకుండా!

13-04-2025 12:00:00 AM

ప్రస్తుతం మనదేశంలో 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్ల సంఖ్య 15 కోట్లు. అంటే మొత్తం జనాభా అయిన 140 కోట్లలో దాదాపు 10.5 శాతం మంది పెద్దవాళ్లే. వీళ్లలో దాదాపు ౬౫ నుంచి 70 ఏళ్లవాళ్లలో 25 శాతం మంది అనుకోకుండా కిందపడిపోతూ ఉండగా.. 70 నుంచి 80 ఏళ్ల మధ్యవాళ్లలో పడిపోయే వారి శాతం 35శాతంగా ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 

మామూలుగా పదిమందిలో ఆరుగురు ఇండ్లలోనే పడుతుంటారు. పడిపోవడం మెల్లగానే పడిపోయినట్లు కనిపించినా ఆ పడటం తాలూకు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. అలా పడిపోయినప్పుడు మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, తుంటి ఎముక ఫ్రాక్చర్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. 

* పడిపోవడానికి సరైన కారణాలను తెలుసుకుని.. వాటిని సరిదిద్దుకోవాలి. అంటే పడుకున్నవారు లేదా కూర్చున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడిపోవడం జరుగుతున్నా అలా ఉన్నపళంగా లేవడం సరికాదు. పడుకున్న వారు తాము పక్క నుంచి లేస్తున్నప్పుడు మొదట మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ.. ఆ తర్వాత లేచి కూర్చుని.. అప్పుడు మెల్లగా నిల్చోవాలి. కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా.. మెల్లగా లేచి నిలబడాలి. 

* ఆరోగ్య కారణాల వల్ల ఇలా పడిపోయే మెడికల్ హిస్టరీ ఉన్నవారు అందుకు కారణాన్ని తెలుసుకోవడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి అందుకు అవసరమైన చికిత్స తీసుకోవాలి.

* అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్) కారణాలుంటే అవేమిటో తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

* అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమయ్యే ఉపకరణాలు.. అంటే  వాకింగ్ స్టిక్, వాకర్, కళ్లజోడు వంటివి అందుబాటులో ఉంచుకోవాలి. 

* కాస్తంత పెద్ద వయసు మహిళలు హైహీల్స్ తొడగడం సరికాదు. తమకు సురక్షితంగా ఉండే ప్లాట్ హీల్ పాదరక్షలు వాడాలి. 

* కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం చాలా రకాల పడిపోవడాన్ని నివారిస్తాయి. 

వయసుపై భావోద్వేగాల ప్రభావం

ఎవరైనా తమ కష్టాల గురించి చెబుతున్నప్పుడు మన హృదయం బరువెక్కుతుంది. ఒక్కోసారి కళ్లు చెమరుస్తాయి. దీన్నే సైకాలజిస్ట్‌లు ‘భావోద్వేగ సంక్రమణ’ గా పిలుస్తారు. జలుబు ఇతరుల కంటే కొంతమందికి ఎలా వేగంగా అంటుకుంటుందో భావోద్వేగాలు కొందరిలో అలాగే వ్యాప్తి చెందుతాయని మాంట్రియెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు.

సున్నిత మనస్కులు ఇతరుల భావోద్వేగాల విషయంలోను అలాగే ఉంటారని వారు పేర్కొంటున్నారు. ఇతరుల ముఖ కవళికలు, హావభావాలు చూసి కొంతమంది తమకు తెలియకుండానే స్పందిస్తుంటారు. ఉదాహరణకు టీవీలో ఆగ్రహంగా ఎవరైనా ఉన్నట్లు చూడగానే వీరు ఉద్రేకానికి లోనవుతారు. ఎవరైనా విలపిస్తుంటే వీరు ఏడుపు అందుకుంటారు.

ఆనందంగా ఉన్న వ్యక్తుల్ని చూడగానే వీరు సంబరపడతారు. ఆనందం, ప్రేమ, ఆగ్రహం, భయం వంటివి ఇతరుల కంటే వృద్ధుల్లో, అందునా మానసిక ఒత్తిళ్లు ఉన్నవారిలో ఎక్కువ. ఏయే కారణాల వల్ల వృద్ధుల్లో హృద్రోగాలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయో మరింత మెరుగ్గా అంచనా వేయడానికి ఇలాంటి అధ్యయనం ఉపయోగపడుతుంది అని వారు తెలిపారు.