calender_icon.png 17 October, 2024 | 1:55 PM

చెడు వ్యసనాల బారిన పడొద్దు

17-10-2024 11:47:47 AM

భువనగిరిలో సీఎం కప్ టార్చ్ లైట్ ర్యాలీలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు, మత్తుపదార్థాలకు బానిస కావొద్దని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కప్ టర్చ్ ర్యాలీని గురువారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం నుండి భువనగిరి కోట వరకు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ కార్యాలయం వద్ద కాగడ వెలిగించి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీయడానికి సీఎం కప్ చక్కటి వేదిక అన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే సీఎం కప్ ఉద్దేశమన్నారు.


రాష్ట్రంలోని యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, క్రీడల వైపు మొగ్గు చూపాలి అనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీని అక్టోబర్ 3 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రారంభించాన్నారు. గ్రామీణ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ యువతలో మెరికలంటి క్రీడాకారులను వెలికి తీసి వారికి మంచి సౌకర్యాలు కల్పించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ క్రీడలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. యువత క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందన్నారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. సీఎం కప్ పట్ల విస్తృతంగా చైతన్యం కలిగించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొనేలా చూడాలన్నారు.