19-03-2025 01:40:46 AM
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేను తప్పుబడితే నష్టపోయేది బీసేలేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చిందని, కానీ తాము చేసిన సర్వేలో బీసీల లెక్క 56.36 శాతంగా ఉన్నట్లు చెప్పామన్నారు. లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశామన్నారు.
బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం బీసీ సంఘాల నేతలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ అభినందనలు తనకు కాదని, రాహుల్‌గాంధీకి అని తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్‌గాంధీ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.
ఇచ్చిన మాట ప్రకారం రాష్ర్టంలో కులసర్వే నిర్వహించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉందని వివరించారు. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే ఉన్నారని, ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లాంటిదని మరోసారి స్పష్టం చేశారు. ఈ కులగణన పునాదిలాంటిదని, ముందు అమలు చేసుకుని తర్వాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చని సూచించారు.
డాక్యుమెంట్ చేసి వదిలేయలేదు..
కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్‌లో పడొద్దని బీసీనేతలకు సీఎం సూచించారు. పునాదిలోనే అడ్డుపడితే బీసీలకు బీసీలే అన్యాయం చేసుకున్నవారవుతారని వివరించారు. బీసీల హక్కుల సాధనకు తాను మద్దతుగా నిలబడతానని హామీ ఇచ్చారు. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశామన్నారు.
రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నామన్నారు. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదన్నారు. జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుందని వెల్లడించారు.
చట్టబద్ధత కల్పిస్తేనే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు
చిత్తశుద్ధితో రిజర్వేషన్లపై బిల్లు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కులసర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్కతేలాలని సీఎం సూచించారు. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని, అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుందని, అందుకే రాష్ర్టంలో బీసీ కుల సర్వే నిర్వహించుకున్నామని చెప్పా రు.
సీఎంను కలిసిన వారిలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత వీ హన్మంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, దాసు సురేశ్ తదితరులు ఉన్నారు.