మహిళా ఉద్యోగికి బెంగాల్ మంత్రి బెదిరింపులు
కోల్‌కతా, ఆగస్టు 3: బెంగాల్‌లో ఓ మహిళా అధికారిని రాష్ట్ర మంత్రి దూషిస్తూ తీవ్రంగా బెదిరించటం వివాదాస్పదమైంది. మేదినీపూర్ జిల్లాలోని పుర్బాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఇండ్లను తొలగిస్తున్న జిల్లా అటవీశాఖ అధికారి మానిష షావును మంత్రి అఖిల్‌గిరి పరుష పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా ప్రాణహాని కలిగిస్తానని బెదిరించారు. ‘నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగివి. నా ముందు తలవంచాల్సిందే. లేదంటే ఒక్క వారంలో నీ గతి ఏమవుతుందో చూసుకో. ఈ విషయంలో (ఆక్రమణల తొలగింపు) మళ్లీ నువ్వు జోక్యం చేసుకొంటే తిరిగి ఇంటికి కూడా వెళ్లవు. ఈ గూండాలు (తన చుట్టూ ఉన్నవాళ్లను చూపిస్తూ) నిన్ను రాత్రిపూట ఇంటికి వెళ్లనివ్వరు. నీ పని నువ్వు చూసుకో. లేదంటే కర్రతో కొడతా’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఘటన వీడియోను ప్రతిపక్ష బీజేపీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయటంతో మమతా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.