20-04-2025 12:00:00 AM
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన రూపొందించిన ‘ఫూలే’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏప్రిల్ 11వ తేదీనే విడుదల కావాల్సిన ఉండగా, వాయిదా పడింది. ఈ క్రమంలో గతంలో విడుదలకు నోచుకోని ‘పంజాబ్ 95’, ‘తడక్2’ చిత్రాలను ప్రస్తావిస్తూ సెన్సార్ బోర్డు, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనురాగ్ కశ్యప్.
“సామాజిక అంశాలను చూపించే ‘పంజాబ్95’, ‘టీస్’, ‘తడక్2’ వంటి చిత్రాలు సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై విడుదల కాలేదు. కుల, ప్రాంత, జాతి వివక్ష చూపించే ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఇలాంటి సినిమాలు ఎన్ని నిషేధించబడ్డాయో తెలియదు. సొంత ముఖం చూసుకోవడానికి సిగ్గుపడుతున్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించే సినిమా గురించి బహిరంగంగా మాట్లాడలేనంత పిరికివాళ్లు’ అని పేర్కొన్నారు.
ఈ పోస్ట్‌పై విమర్శల నేపథ్యంలోనే స్పందించారు. “మా కుమార్తె, కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు ఆ వర్గం నాయకుల నుంచి లైంగిక వేధింపులు, చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. నేను అన్నది వెనక్కి తీసుకోను. కానీ మీరు నన్ను ఎంత తిట్టినా ఫర్వాలేదు.
నా కుటుంబం ఏమీ అనలేదు, అనదు కూడా. నా కుటుంబం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నా కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగొద్దు. మీరు నా నుంచి క్షమాపణలు కోరారు. అందుకు నేను సారీ చెప్తున్నా’ అని తాజాగా విడుదల చేసిన నోట్‌లో అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.