చిన్న పిల్లలు ఎక్కువగా పెద్దలను అనుకరిస్తూ ఉంటారు. వారు ఏది చేస్తే అదే చేయాలని చూస్తూ ఉంటారు. అందుకే పిల్లల ముందు పెద్దలు జాగ్రత్తగా ప్రవర్తించాలి. పిల్లల ముందు పేరెంట్స్ మంచిగా మాట్లాడితే వాళ్లూ అదే అలవాటు చేసుకుంటారు. తల్లిదండ్రులు బూతులు మాట్లాడితే పిల్లలు అవి విని వేగంగా నేర్చుకునే ప్రమాదం ఉంది. పిల్లల ముందు క్రమశిక్షణతో ప్రవర్తించాలి. పెద్దవారితో, స్నేహితులతో, కొత్తవారితో ఎలా నడుచుకోవాలో వారికి తెలపాలి.
కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలు దాచడానికి పిల్లల్ని అబద్ధం చెప్పమంటారు. అది అప్పటికి ఆట పట్టించడానికి అయినా.. ఎక్కువసార్లు ఇదే రిపీట్ అయితే భవిష్యత్తులో పిల్లలు కూడా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. పిల్లల ముందే భార్యాభర్తలు అసభ్యంగా ప్రవర్తించకూడదు. పిల్లలు చూస్తున్నప్పుడు టీవీల్లో అసభ్యకర సీన్స్ వస్తే ఛానల్ మార్చాలి. అలాగే పిల్లల ముందు దంపతులు గొడవపడకూడదు. ఇది వారిలో భయం పెంచడమే కాకుండా చిన్నారుల మానసిక స్థితి, ఆలోచనపై ప్రభావం చూపే అవకాశం ఉంది.