12-04-2025 12:20:01 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాల్లో భాగంగా అమ్మ పోషణ- బిడ్డలాలన అన్న అంశంపై దేవరకొండలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. పూర్వం దవాఖానలు లేని సమయంలో 90 శాతం సాధారణ ప్రసవాలయ్యేవని గుర్తు చేశారు.
ప్రస్తుతం శారీరక శ్రమలేకపోవడం, సాంకేతికత పెరగడంతో గర్భిణులు సిజేరియన్ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకొవాలని వారు బలంగా ఉన్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరణమని, బాలింతలు బిడ్డకు తమ పాలే పట్టాలని చెప్పారు. ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతూ.. ఆడ పిల్లలు ఇంటికి వెలుగని వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
దేవరకొండకి మరో 5 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ శాలిని, డాక్టర్ విజయ మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి అధ్యక్షతన సమావేశం వహించారు.